Minister Sathyavathi Rathod : మంగళహారతి పల్లెంలో డబ్బులు పెట్టారు..పోలీసులు కేసు పెట్టారు
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ పై పోలీస్ కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ గూడూరు పోలీస్ స్టేషన్‌లో మంత్రిపై ఫిర్యాదు అందింది. ఈ మేరకు మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ కోసం మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక మహిళలు ఆమెకు హారతి ఇచ్చారు. ఈ క్రమంలో సంతోషించిన సత్యవతి, వారికి హారతి పళ్లెంలో రూ.4 వేలు అందించారు. దీంతో ఈ విషయం కాస్త వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచారంలో మంత్రి డబ్బులు ఇవ్వడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడమేనని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నంచారని ఎఫ్‌ఎస్‌టీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పలు సెక్షన్ల కింద మంత్రిపై కేసు నమోదు
ఎన్నికల సయయంలో ఓటర్లను ప్రలోభపెట్టడంలో భాగంగానే నగదు ఇచ్చారని,ఈ మేరకు ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో FST ప్రతినిధులు పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధన 171-E,171-H ఐపీసీ r/w188 ioc సెక్షన్ల కింద మంత్రి సత్యవతి రాథోడ్ పై గూడూరు పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో జరిగిన వీడియో ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ చేపట్టడం అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. సాధారణంగా రాజకీయ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏం చేసినా అడిగేవారుండరు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, ప్రతి పని ఆచితూచి చేయాల్సి ఉంటుంది. కాదంటే కేసులతో ఇబ్బంది పడటం ఖాయం. పలు సందర్భాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పదవి కోల్పోయిన వారు ఉండటం గమనార్హం.