
Andhra News: ట్రూఅప్ భారం లేకుండా వినియోగదారులకు ఊరట.. బొగ్గు కేటాయింపుల్లో కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన లెక్కల ప్రకారం, జెన్‌కో థర్మల్ కేంద్రాల కోసం అవసరమయ్యే బొగ్గు కొనుగోళ్లు, రవాణా విధానాలను సమర్థంగా నిర్వహిస్తే ఏటా సుమారు రూ.753 కోట్ల వరకు ఆదా సాధ్యమవుతుంది. ఇందుకోసం సింగరేణి కాలరీస్ నుంచి ఇప్పటివరకు తీసుకుంటున్న బొగ్గులో కొంత భాగాన్ని తగ్గించి, ఆ పరిమాణాన్ని ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎంసీఎల్) నుంచి పొందాలని ప్రతిపాదించింది. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, వినియోగదారులపై పడే ట్రూఅప్ భారాన్ని తొలగించాలన్న ఉద్దేశ్యంతో ఈ ఆలోచనలు ముందుకు వచ్చాయి. గత వైకాపా ప్రభుత్వ కాలంలో ఏటా కనీసం వెయ్యి కోట్లకు మించి ట్రూఅప్ భారాన్ని వినియోగదారులపై మోపగా, కొత్త కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆ భారం లేకుండా చేసింది.
వివరాలు
బొగ్గు కేటాయింపుల్లో మార్పులు
సింగరేణి విక్రయించే జి-12 గ్రేడ్ బొగ్గు టన్ను ధర రూ.4,976 కాగా, ఎంసీఎల్ అదే గ్రేడ్ బొగ్గును టన్నుకు రూ.4,335కే అందిస్తోంది. అంటే ప్రతి టన్నుపై రూ.641 ఆదా అవుతుంది. సింగరేణి నుంచి జెన్‌కోకు ఏటా 68.80 లక్షల టన్నుల కోటా ఉన్నా, ధర ఎక్కువ కావడంతో ఆ భారం కంపెనీపై పడుతోంది. ఈ పరిస్థితిలో 48 లక్షల టన్నుల బొగ్గు కేటాయింపును ఎంసీఎల్‌కు మళ్లిస్తే, ఏటా రూ.308 కోట్లు మిగులుతాయని అంచనా. దీనికి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 17న కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు (ఎంవోసీ) లేఖ పంపింది. మిగిలిన 20.80 లక్షల టన్నులను మాత్రం సింగరేణి నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళిక వేశారు.
వివరాలు
సంస్థకు చెల్లించే స్థిరఛార్జీల్లో ఏటా రూ.205 కోట్లు మిగులు
విదేశీ బొగ్గు కొనుగోలు బదులు,ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్(ఈసీఎల్)నుంచి అధిక గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ (జీసీవీ)ఉన్న బొగ్గును వాడితే విద్యుత్ ఉత్పత్తి 10% పెరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. దీని వల్ల కంపెనీకి చెల్లించే స్థిర ఛార్జీలలో ఏటా రూ.205 కోట్లు తగ్గించుకోవచ్చని అంచనా. ముఖ్యంగా కృష్ణపట్నం థర్మల్ కేంద్రంలోని మొదటి యూనిట్‌కు అధిక జీసీవీ బొగ్గును వాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి దీని కోసం జెన్‌కో 50వేల టన్నుల విదేశీ బొగ్గును అధిక ధరకు దిగుమతి చేసుకుంటోంది. దీన్ని ప్రత్యామ్నాయంగా ఈసీఎల్ నుంచి 18లక్షల టన్నుల బొగ్గుతో భర్తీ చేయాలని భావించి, ఇందుకోసం ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ (ఎఫ్‌ఎస్‌ఏ)ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 27న ఎంవోసీకి లేఖ రాసింది.
వివరాలు
రవాణా ఖర్చులలోనూ ఆదా
ప్రస్తుతం ఈసీఎల్ నుంచి 98 లక్షల టన్నుల బొగ్గు వస్తోంది. అయితే తక్కువ గ్రేడ్ బొగ్గు వాడటం వల్ల ఆ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి 60%కే పరిమితమైపోతోంది. బొగ్గు రవాణా కోసం రైల్వేశాఖకు టెలిస్కోపిక్ పద్ధతిలో ఛార్జీలు చెల్లిస్తే ఏటా రూ.240 కోట్లు మిగులుతుందని లెక్కలు చెబుతున్నాయి. జెన్‌కో ప్రతీ ఏడాది రైలుమార్గం ద్వారా సుమారు 80 లక్షల టన్నుల బొగ్గును థర్మల్ కేంద్రాలకు తరలిస్తోంది. టెలిస్కోపిక్ విధానాన్ని అనుసరిస్తే టన్నుకు రూ.300 వరకు ఖర్చు తగ్గుతుంది. దీంతో ఏటా రవాణా ఖర్చులోనే రూ.240 కోట్లు మిగులే అవకాశం ఉందని అంచనా. ఈ విధానంలో దూరం పెరుగుతున్న కొద్దీ కిలోమీటరుకు రవాణా ఛార్జీలు తగ్గడం ప్రధాన లాభం.