Uttarpradesh : యూపీలో భూ వివాదం.. ఓబీసీ నేత గొంతు కోసి హత్య
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి)కి చెందిన స్థానిక నాయకురాలు నందిని రాజ్‌భర్‌ను ఓ దుండగుడు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం బాధితురాలి ఇంట్లోనే హత్య జరిగింది. హత్య కేసులో ఐదుగురిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు,వారిలో ముగ్గురు ఆనంద్ యాదవ్, ధ్రువ్ చంద్ర యాదవ్, ఒక మహిళను అరెస్టు చేశారు. నందిని రాజ్‌భర్ భర్త మేనమామ బాలకృష్ణకు చెందిన స్థలాన్ని స్థానిక ల్యాండ్ మాఫియా అక్రమంగా కబ్జా చేసి, దానికి సంబంధించిన పూర్తి సొమ్ము చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 29న బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడగా, రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యమైంది.
నందిని రాజ్‌భర్, బాలకృష్ణ లాబీయింగ్
శ్రవణ్ యాదవ్, ధ్రువ్ చంద్ర యాదవ్,పన్నె లాల్ యాదవ్ అనే ముగ్గురు ల్యాండ్ మాఫియా చేసిన మోసానికి వ్యతిరేకంగా నందిని రాజ్‌భర్, బాలకృష్ణ లాబీయింగ్ చేశారు. పన్నె లాల్ యాదవ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. నందిని రాజ్‌భర్ హత్యకు ముందు బాలకృష్ణ భూమిని కబ్జా చేసిన ల్యాండ్ మాఫియాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.