Mamata Banerjee: టీఎంసీ పేరు, గుర్తు ఫ్రీజ్‌పై మమత పిటిషన్.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ అసలు పేరు 'ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' (ఏఐటీసీ), రిజర్వ్‌డ్ ఎన్నికల గుర్తు 'పూలు-గడ్డి'ని ఫ్రీజ్ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న మధ్యంతర నిర్ణయాన్ని ఆమె సవాల్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్ ఉపఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. మమత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ అంశాన్ని కోర్టులో ప్రస్తావిస్తూ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు జాబితా చేయాలని కోరారు.
వివరాలు
'ఇలా ఎలా జరుగుతుంది?'.. కపిల్ సిబల్ ప్రశ్న
ఎన్నికల సంఘం ముందు ఈ వ్యవహారంపై విచారణ జూన్‌లోనే ప్రారంభమైందని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు.
మమత వర్గం జులైలోనే తన సమాధానాన్ని సమర్పించిందని చెప్పారు.
అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మధ్యలో పార్టీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేశారని సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
''జూన్‌లోనే విచారణ మొదలైంది. జులైలో మేం సమాధానం ఇచ్చాం. ఆ తర్వాత ఏమీ చేయలేదు. ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. దాని మధ్యలో గుర్తును ఫ్రీజ్ చేశారు. ఇలా ఎలా జరుగుతుంది?'' అని ఆయన ప్రశ్నించారు.
వివరాలు
ఉపఎన్నికల ముందు ఈసీఐ మధ్యంతర నిర్ణయం
అయితే ఈ అంశంపై వెంటనే వాదనలు ప్రారంభించవద్దని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సిబల్‌కు సూచించారు.
''మరో వర్గం కూడా వాదనలు వినిపించాలి. ముందుగా కేసును జాబితా చేయనివ్వండి'' అని తెలిపారు.
దీనిపై సిబల్ స్పందిస్తూ.. ఎన్నికల సంఘం కొత్త కొత్త పరిణామాలకు తెరతీస్తోందని వ్యాఖ్యానించారు.
టీఎంసీ పేరు, ఎన్నికల గుర్తుపై రెండు ప్రత్యర్థి వర్గాలు హక్కు కోరడంతో ఈసీఐ ఈ వ్యవహారాన్ని పరిశీలించింది.
ఇరువర్గాల ప్రతినిధుల వాదనలు విన్న అనంతరం సెప్టెంబర్ 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
రెండు వర్గాలకూ కొత్త పేర్లు, గుర్తులు
ఈసీఐ మధ్యంతర నిర్ణయం ప్రకారం రాబోయే ఉపఎన్నికల్లో ఏ వర్గమూ 'ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' పేరు, 'పూలు-గడ్డి' గుర్తును ఉపయోగించకూడదు.
మమతా బెనర్జీ వర్గానికి 'మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' అనే పేరు, 'ఫుట్‌బాల్ ప్లేయర్' గుర్తును కేటాయించారు.
ప్రత్యర్థి వర్గానికి 'డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్' పేరు, 'ఎన్వలప్' (కవర్) గుర్తును కేటాయించారు.
ఈ ఏర్పాట్లు ప్రస్తుతం జరగనున్న ఉపఎన్నికల వరకే మధ్యంతరంగా అమల్లో ఉంటాయి.
వివరాలు
అసలు టీఎంసీ గుర్తింపును తిరిగి సాధిస్తానన్న మమత
రెండు వర్గాల్లో ఏది అసలైన పార్టీ అనేది తేల్చేందుకు అందుబాటులో ఉన్న సమయం సరిపోలేదని ఎన్నికల సంఘం పేర్కొంది.
అందుకే తుది నిర్ణయం వెలువడే వరకు అసలు పార్టీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది. ఈ నిర్ణయంపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది 'చీకటి రోజు'గా అభివర్ణించారు. పార్టీ గుర్తింపును కోల్పోవడాన్ని తల్లి తన బిడ్డను కోల్పోయిన పరిస్థితితో పోల్చారు.
రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయపరంగా పోరాడి టీఎంసీ అసలు పేరు, గుర్తును తిరిగి సాధిస్తానని ఆమె ప్రకటించారు.