
Supreme Court: 33 మంది న్యాయమూర్తులలో.. 21 మంది న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెల్లడించిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
భారత న్యాయవ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా, సుప్రీంకోర్టు సోమవారం కీలక సమాచారం బహిర్గతం చేసింది.
సర్వోన్నత న్యాయస్థానం జడ్జీలు స్వయంగా సమర్పించిన తమ ఆస్తుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలందరికీ అందుబాటులో ఉంచింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆస్తులు:
ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంజీవ్ ఖన్నా వద్ద రూ.55.75 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి.
షేర్ మార్కెట్‌లో రూ.14 వేల విలువైన పెట్టుబడులు,పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ.1.06 కోట్లు,జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో మరో రూ.1.2 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.
వివరాలు
జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఆస్తులు:
వార్షిక ప్రీమియంగా రూ.29,625 చెల్లించే LIC మనీ బ్యాక్ పాలసీ, దిల్లీలో ఓ ఫ్లాట్, కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో 2,446 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్, హిమాచల్ ప్రదేశ్‌లో డల్హౌసీలో ఇల్లు ఉన్నాయి.
ఆయన వద్ద చరాస్తుల పరంగా 250 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, మారుతి స్విఫ్ట్ కారు ఉన్నాయి.
తదుపరి సీజేఐగా నియమితులు కానున్న జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఖాతాలో రూ.19.63లక్షల బ్యాంకు నగదు ఉంది.
ఆయనకు రూ.5.25లక్షల బంగారు ఆభరణాలు,మహారాష్ట్ర అమరావతిలో వారసత్వంగా వచ్చిన ఇల్లు, ముంబయిలో బాంద్రా ప్రాంతంలో అపార్ట్‌మెంట్,అలాగే దిల్లీ డిఫెన్స్ కాలనీలో కూడ ఒక అపార్ట్‌మెంట్ కలవు.
ఆయనకు వ్యవసాయ భూములూ ఉన్నాయి.ఆయన భార్యకు రూ.29.70లక్షల విలువైన ఆభరణాలు, రూ.61,320 నగదు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.
వివరాలు
జస్టిస్ సూర్యకాంత్ ఆస్తుల వివరాలు:
ఈ ఏడాది నవంబర్ 24న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సూర్యకాంత్‌కు చండీగఢ్‌లో ఓ నివాసం, పంచకులలో 13 ఎకరాల వ్యవసాయ భూమి, గురుగ్రామ్‌లో ప్లాట్ ఉన్నాయి.
ఆయన వద్ద మొత్తం రూ.4.11 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 100 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు ఖరీదైన గడియారాలు ఉన్నాయి.
జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఆస్తుల వివరాలు:
జస్టిస్ కేవీ విశ్వనాథన్‌కి రూ.120 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయి.
ఆయనకు దిల్లీలోని సఫ్దర్‌జంగ్ డెవలప్‌మెంట్ ఏరియా, గుల్మోహర్ పార్క్‌లో అనేక ఆస్తులు ఉన్నాయి.
తమిళనాడులో కోయంబత్తూరులో ఒక అపార్ట్‌మెంట్ ఉన్నట్లు వెల్లడించారు.
ఆయన 2010-11 నుంచి 2024-25 వరకు చెల్లించిన రూ.91.47 కోట్ల ఆదాయపు పన్ను వివరాలను కూడా స్వచ్ఛందంగా వెల్లడించారు.
వివరాలు
అదనంగా అందుబాటులో ఉంచిన సమాచారం:
జడ్జీల ఆస్తుల సమాచారం మాత్రమే కాకుండా, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక విధానం, హైకోర్టు కొలీజియానికి చెందిన బాధ్యతల గురించి కూడా వెబ్‌సైట్‌లో ప్రజల దృష్టికి తీసుకువచ్చారు.
ఇటీవల దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నగదు దొరికినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించాలన్న సంకల్పంతో ఈ ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది.