SC entrusts CBI: డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ..
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్టుల మోసాలపై జాతీయ స్థాయిలో సీబీఐ దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ వద్ద నమోదు చేసుకున్న ఎఫ్ఐఆర్‌ల వివరాలను సీబీఐకు అందించి పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా సూచన ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసును స్వయంగా (సుమోటోగా) పరిశీలిస్తోంది. ఈ విషయంపై, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి నేతృత్వంలోని బెంచ్ డిజిటల్ అరెస్టుల మోసాలపై దర్యాప్తు ప్రారంభించడానికి సీబీఐని ఆదేశించింది.
వివరాలు
ఆ పని ఎందుకు చేయడం లేదు ఆర్బీఐ కి నోటీసులు:
రాష్ట్రాలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (RBI) కూడా నోటీసులు జారీ చేశారు. సైబర్ మోసాలకు ఉపయోగించబడిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీని ఎందుకు ఉపయోగించవచ్చని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించి వివరాలు సేకరించడం, డిజిటల్ అరెస్ట్ కేసులపై సీబీఐ దర్యాప్తుకు సహకరించడం, అలాగే పౌరులను మోసం చేయడంలో సహకారం చేసిన బ్యాంక్ అధికారులను గుర్తించడం సీబీఐకి సూచించింది.
వివరాలు
కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
దుర్వినియోగాలను అరికట్టడానికి, ఒక వ్యక్తికి అనేక సిమ్‌లను కేటాయించకుండా టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు టెలికాం మంత్రిత్వ శాఖకు సూచించింది. ఆన్‌లైన్ మోసాలను నియంత్రించేందుకు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేంద్ర హోం,టెలికాం, ఆర్థిక శాఖల ప్రతిస్పందనలు కూడా సొలిసిటర్ జనరల్ ద్వారా సమర్పించాలని ఆదేశించింది. అలాగే, విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడే నేరస్థులను పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ సహాయాన్ని సీబీఐ ఉపయోగించాలని సూచించింది. ప్రజలను మోసం చేసే ఖాతాలను ఫ్రీజ్ చేయడం కోసం సీబీఐతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
వివరాలు
తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రీ:
తెలంగాణలో మాత్రం సీబీఐకి ప్రత్యక్ష దర్యాప్తు చేపట్టడానికి అనుమతి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీబీఐకి ఇచ్చిన "జనరల్ కన్సెంట్"ను ఉపసంహరించడం వల్ల రాష్ట్రంలో దర్యాప్తు చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరపై విచారణ చేపట్టాలన్న అభ్యర్థనతో సీబీఐకు అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం, డిజిటల్ అరెస్టుల కేసుల విషయంలో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సీబీఐకు పూర్తి సహకారం అందించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.