Supreme Court: మతపరమైన నిర్మాణాలలపై ఇప్పట్లో కొత్త పిటిషన్లు వద్దు.. 'సుప్రీం' సంచలన ఆదేశాలు
దేశంలోని పలు ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాలకు సంబంధించి కొత్త పిటిషన్లను దాఖలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది. మధుర, కాశీ క్షేత్రాలకు సంబంధించిన కేసులు ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో, మరిన్ని పిటిషన్లు వేశే అవసరం లేదని సీజేఐ సంజీవ్ ఖన్నా గురువారం ఆదేశాలు జారీ చేశారు. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పిటిషన్లపై కేంద్రం నాలుగు వారాల్లోగా స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కింది కోర్టులకు ఆదేశాలు
అఫిడవిట్ దాఖలుకు కూడా కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు, ప్రస్తుతం ప్రార్థనా స్థలాల్లో సర్వేలను నిలిపివేయాలని పేర్కొంది. అదనంగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు హైకోర్టులు సహా ఏ కోర్టులోనూ సర్వేలకు సంబంధించిన పిటిషన్లు స్వీకరించరాదని, పెండింగ్ కేసుల్లో మధ్యంతర లేదా తుది ఉత్తర్వులు జారీ చేయకూడదని కింది కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.