
OMC Case:అక్రమ మైనింగ్ కేసులో.. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురు
ఈ వార్తాకథనం ఏంటి
ఓబుళాపురం అక్రమ గనుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
2022లో తెలంగాణ హైకోర్టు జస్టిస్ చిల్లకూరు సుమలత నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఆమెను కేసు నుంచి విరమింపజేస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.
శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌పై హైకోర్టు ఎటువంటి వాదనలు వినకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందని సీబీఐ చేసిన వాదనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ, శ్రీలక్ష్మి పిటిషన్‌ను తిరిగి మెరిట్‌ల ఆధారంగా విచారించాలని, మూడు నెలల్లో నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందల్‌లు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.
వివరాలు
సీబీఐ కోర్టులో పిటిషన్ నేపథ్యం:
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ గనుల కేసులో మొదటి ఛార్జిషీట్‌లో ఆమె పేరు లేకపోయినా, అనంతరం సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో శ్రీలక్ష్మిని ఆరోనిందితురాలిగా చేర్చారు.
దీనిపై ఆమె హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. 2006 మే 17 నుంచి 2009 అక్టోబరు 10 వరకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శిగా ఆమె పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగంతోపాటు, కుట్ర పద్ధతిలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రెండు గనుల లీజులు మంజూరు చేశారనే ఆరోపణలను ఆమె తిరస్కరించారు.
సీబీఐ వాదన ప్రకారం, శ్రీలక్ష్మి ప్రభుత్వ అధికారిగా వ్యవహరిస్తూనే నిందితులకు అక్రమంగా మైనింగ్ లీజులు మంజూరు చేసి, ప్రభుత్వ విశ్వాసాన్ని వంచించి, మోసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
వివరాలు
హైకోర్టు తీర్పు ముఖ్యాంశాలు:
ఈ వాదనల ఆధారంగా, 2022 అక్టోబరు 17న సీబీఐ ప్రత్యేక కోర్టు ఆమె డిశ్చార్జి పిటిషన్‌ను తిరస్కరించింది.
దీనిపై శ్రీలక్ష్మి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా, జస్టిస్ సుమలత 39 పేజీల తీర్పుతో సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు.
శ్రీలక్ష్మి ఈ కేసులో నేరుగా గానీ, పరోక్షంగా గానీ ఇతర నిందితులతో కుమ్మక్కై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఎలాంటి ఆధారాలు ఛార్జిషీట్లలో లేవని, అందువల్ల ఆమెపై నమోదైన కేసులన్నింటినీ కొట్టి వేయడంతో పాటు, ఆమెకు విముక్తి కల్పించినట్లు 2022 నవంబరు 8న తీర్పు వెలువరించారు.
వివరాలు
సుప్రీంకోర్టులో సీబీఐ అప్పీల్:
ఈ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ, సీబీఐ 2023 ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తమ వాదనలు వినకుండా హైకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందని అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ ధర్మాసనంలో వాదించారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును రద్దు చేసింది.
ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన తొలి నుంచీ మళ్లీ విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మూడు నెలల గడువులోపు తీర్పు ఇవ్వాలని స్పష్టం చేసింది.