Loading...
Supreme Court: తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. కీలక షరతులు ఇవే!
తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. కీలక షరతులు ఇవే!

Supreme Court: తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. కీలక షరతులు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24న కొండపై ఉన్న దీపత్తూన్‌ (దీపస్తంభం) వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతించింది. అయితే ఈ కార్యక్రమం నిర్వహణకు పలు నిబంధనలు విధించింది. అధికారికంగా నియమించిన బృందం మాత్రమే పోలీసుల భద్రత మధ్య దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాల అమలుపై తదుపరి విచారణ జరిగే వరకు స్టే విధించింది.

వివరాలు 

సుప్రీంకోర్టు విధించిన షరతులివే..

కార్తీక దీపం వెలిగించే బృందంలో ఎంతమంది ఉండాలి? ఆ బృందం కూర్పు ఎలా ఉండాలనే విషయాలను మదురై జిల్లా కలెక్టర్ నిర్ణయించాలి.

ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో), భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ), పోలీస్ కమిషనర్‌తో సంప్రదింపులు జరిపి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.

దీపం వెలిగించేందుకు ఎంపిక చేసిన బృందానికి పోలీసుల రక్షణ కల్పించాలి. అవసరమైతే కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్‌పీఎఫ్‌) సహాయాన్ని కూడా తీసుకోవచ్చు.

అనుమతి పొందిన బృందం సభ్యులు, సంబంధిత అధికారులు మినహా ఇతరులెవరికీ ఆ ప్రాంతంలోకి ప్రవేశం ఉండదు.

వివరాలు 

సుప్రీంకోర్టు విధించిన షరతులివే..

ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు, నిరసనలు నిర్వహించకూడదు. నినాదాలు చేయడానికి కూడా అనుమతి లేదు.

దీపం వెలిగించిన వెంటనే బృందం అక్కడి నుంచి వెళ్లిపోవాలి. అంతేకాకుండా కొండపై ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదు. కొత్త నిర్మాణాలు చేయడం, ఇప్పటికే ఉన్న కట్టడాల్లో మార్పులు చేయడం కూడా నిషేధం.

కొండ సమీపంలోని దర్గా, మసీదుకు వెళ్లే మార్గాల్లో ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ అనుమతి తాత్కాలికమైనదేనని పేర్కొంది. దీనివల్ల కొండపై దీపం వెలిగించే సంప్రదాయ హక్కు లేదా ఆ స్థలంపై యాజమాన్య హక్కులు ఎవరికీ దక్కినట్లు కాదని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

అసలు వివాదం ఏమిటి?

తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండకు మురుగన్ స్వామి ఆరు పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ కొండపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంతో పాటు దర్గా కూడా ఉన్నాయి.

1920లో కొండ యాజమాన్యానికి సంబంధించి వివాదం తలెత్తింది.

దీంతో న్యాయస్థానాలు విచారణ జరిపి ఆలయానికి సంబంధించిన ప్రాంతాలను,దర్గాకు చెందిన ప్రాంతాలను వేర్వేరుగా గుర్తించాయి.

1994లో కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ భక్తుడు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మొదలైంది.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 1996లో సంప్రదాయ మండపం వద్దే దీపం వెలిగించాలని ఆదేశించింది.

తాజాగా ఈ అంశం మరోసారి న్యాయస్థానాల దృష్టికి వచ్చింది.దీంతో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ దీపం వెలిగించేందుకు అనుమతించింది.

ADVERTISEMENT

వివరాలు 

నవంబర్ 24న కార్తీక దీపోత్సవం

ఈ ఏడాది నవంబర్ 24న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో భరణి దీపాన్ని తెల్లవారుజామున వెలిగిస్తారు.

సాయంత్రం సుమారు 6 గంటలకు మహాదీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది.

కార్తీక మాసంలో భక్తులు తమ ఇళ్లలోనూ సాయంత్రం వేళ మట్టి ప్రమిదల్లో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవాన్ని జరుపుకుంటారు.

అయితే తిరుపరంకుండ్రం కొండపై మాత్రం సుప్రీంకోర్టు విధించిన నిబంధనలకు అనుగుణంగానే ఈ ఏడాది దీపోత్సవం నిర్వహించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT