
Supreme Court:హైకోర్టు న్యాయమూర్తి క్రిమినల్ కేసులను విచారించకుండా ఉత్తర్వులు.. వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
హైకోర్టు జడ్జిపై విధించిన ఆంక్షలకు సంబంధించిన గత ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court)కు చెందిన ఒక న్యాయమూర్తి రిటైర్ అయ్యే వరకు ఆయనకు క్రిమినల్ కేసులు అప్పగించకూడదన్న పరిమితి విధిస్తూ ఈ నెల 4న జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అభ్యర్థన మేరకు, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వివరాలు
అలహాబాద్ హైకోర్టు తీర్పు చట్టపరంగా తప్పిదమనే అభిప్రాయం
ఈ కేసులో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నుంచి లేఖ అందినట్లు ధర్మాసనం వెల్లడించింది. సంబంధిత న్యాయమూర్తికి ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దేశ్యం కాదని, అయితే కొన్ని సందర్భాల్లో పరిమితులను దాటి వ్యవహరించినప్పుడు న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటం కోర్టు బాధ్యత అని జస్టిస్ పార్దివాలా పేర్కొన్నారు. అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నప్పటికీ, అలహాబాద్ హైకోర్టు తీర్పు చట్టపరంగా తప్పిదమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ఇటువంటి ఆదేశాలను విస్మరించడం సాధ్యం కాదని స్పష్టంచేశారు.
వివరాలు
ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు
ఒక సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలకు అనుమతి ఇస్తూ,అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై విచారణ జరుగుతున్నకేసులో,ఆ న్యాయమూర్తి రిటైర్ అయ్యేంతవరకు ఆయనకు ఎలాంటి క్రిమినల్ కేసులు అప్పగించవద్దని ఈ నెల 4న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంలో,సుప్రీంకోర్టు ఆదేశంలోని కొన్ని అంశాలు అమలుకాకుండా అడ్డుకోవడానికి ఫుల్‌కోర్టు సమావేశం కావాలని అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు గురువారం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. హైకోర్టులపై పరిపాలనా పర్యవేక్షణాధికారం సుప్రీంకోర్టుకు లేదని,అందువల్ల ఆగస్టు 4న జారీ చేసిన సుప్రీంకోర్టు ఉత్తర్వులలోని 24వ, 26వ పేరాల నిర్దేశాలను అమలు చేయరాదని ఫుల్‌కోర్టు తీర్మానించాలన్నది వారి డిమాండ్. ఈ నేపధ్యంలోనే సుప్రీంకోర్టు తన పూర్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.