Supreme Court: 'వీధి కుక్కల దాడులను సహించలేం'.. కఠిన చర్యలకు సుప్రీంకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యను నిర్లక్ష్యం చేయలేమని స్పష్టం చేసింది. రహదారులు,బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా,జస్టిస్ ఎన్‌వీ అంజారియా సభ్యులుగా ఉన్న త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రజా రవాణా కేంద్రాలు,ఆసుపత్రులు,పాఠశాలలు,బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో సంచరించే వీధి కుక్కలను పట్టుకున్న తర్వాత కుటుంబ నియంత్రణ చికిత్స, టీకాలు పూర్తి చేసినా తిరిగి అదే ప్రాంతాల్లో వదలరాదని కోర్టు మరోసారి స్పష్టం చేసింది.
వివరాలు
కుక్క కాటు ఘటనలు భయంకర స్థాయికి చేరాయని ఆందోళన
వాటిని రహదారులపైకి మళ్లీ వదిలితే ప్రజలకు ప్రమాదం కొనసాగే అవకాశముందని పేర్కొంది. కుక్కలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తే అవి మరింత ఆందోళనకు గురై దాడులు పెంచే ప్రమాదం ఉందని జంతు హక్కుల కార్యకర్తలు చేసిన వాదనలను ధర్మాసనం అంగీకరించలేదు. ప్రస్తుతం వీధి కుక్కల సంచారం తీవ్రమైన సమస్యగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న దాడులపై న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఘటనల్లో పిల్లల ముఖాలను కూడా తీవ్రంగా గాయపరుస్తున్న దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను చూస్తూ మౌనంగా ఉండలేమని స్పష్టం చేశారు.
వివరాలు
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపైనా ఆగ్రహం
'యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా' రూపొందించిన విధివిధానాల ప్రకారం పట్టుబడిన వీధి కుక్కలను శాశ్వతంగా జంతు సంరక్షణ కేంద్రాల్లోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. వాటిని తిరిగి వీధుల్లోకి వదలరాదని తెలిపింది. ఈ ఆదేశాలను పాటించని అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై కూడా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వాటి సంరక్షణకు అవసరమైన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను పెంచడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. సరైన ప్రణాళిక లేకుండా పేరుకే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించడం వల్లే పరిస్థితి అదుపు తప్పిందని అభిప్రాయపడింది. ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే సమస్య ఈ స్థాయికి చేరుకునేది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.