Page Loader
LMV Driving Licence: ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు రవాణా వాహనాలను నడపవచ్చు: సుప్రీంకోర్టు
ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు రవాణా వాహనాలను నడపవచ్చు: సుప్రీంకోర్టు

LMV Driving Licence: ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు రవాణా వాహనాలను నడపవచ్చు: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు వాణిజ్య వాహన డ్రైవర్లకు ఊరట కలిగించే ప్రధాన తీర్పును బుధవారం ఇచ్చింది. తేలికపాటి మోటారు వాహనాల (ఎల్‌ఎంవీ) డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు గరిష్ఠంగా 7.5 టన్నుల బరువు మించని రవాణా వాహనాలను నడపవచ్చని స్పష్టంచేసింది. ఇలాంటి వాహనాలను నడపడానికి మోటారు వాహన చట్టం (ఎంవీఏ) ప్రకారం అదనపు లైసెన్స్ అవసరం లేదని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న వ్యాపారులు, ఆటోలు, క్యాబ్‌లు నడిపేవారు ఎల్‌ఎంవీ లైసెన్స్‌తో 7,500 కిలోల కంటే తక్కువ బరువున్న వాణిజ్య వాహనాలను నడపవచ్చని తేల్చింది. అయితే, ప్రమాదకర సరకులు తీసుకెళ్ళే వాహనాలకు మాత్రం ఇది వర్తించదు.

వివరాలు 

కేసు నేపథ్యం 

ఈ తీర్పును రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్ర సభ్యులుగా ఉన్నారు. ఈ తీర్పును అందరి తరపున జస్టిస్ హృషికేశ్ రాయ్ రాశారు. ముకుంద్ దేవాంగన్ వర్సెస్ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కేసులో 2017లో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. 7,500 కిలోల లోపు బరువున్న రవాణా వాహనాలను ఎల్‌ఎంవీ నిర్వచనం నుంచి మినహాయించరాదని ఆ తీర్పు పేర్కొంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ తీర్పును సవాలు చేస్తూ 76 పిటిషన్లు దాఖలు చేశాయి.

వివరాలు 

బీమా కంపెనీల అభ్యంతరాలను తోసిపుచ్చిన ధర్మాసనం 

7.5 టన్నుల బరువున్న వాహనాన్ని ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉన్న వ్యక్తి నడపటానికి అర్హుడేనా? ప్రమాదం జరిగితే బీమా చెల్లింపుకు అర్హత ఉందా? అనే అంశాలపై విచారణ జరిపిన ధర్మాసనం, బీమా కంపెనీల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఎల్‌ఎంవీ లైసెన్సుతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న వాదనకు ఆధారాలు లేవని పేర్కొంది. డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించి చట్టంలోని లోపాలను సరిదిద్దాలని కేంద్రాన్ని కోరింది.