
'Shocking':అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
ఈ వార్తాకథనం ఏంటి
మహిళ దుస్తులను పట్టుకొని లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు బుధవారం స్వయంగా (సుమోటోగా) విచారణ చేపట్టింది.
"ఆ వ్యాఖ్యలు సున్నితమైనవే కాకుండా, అమానవీయంగా ఉన్నాయి" అని జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ, కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
వివరాలు
అసలేం జరిగిందంటే..
2021 నవంబరులో ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వారిని అడ్డగించి, బాలికను ఇంటి దగ్గర దింపుతామని చెప్పి ద్విచక్ర వాహనంలో ఎక్కించుకున్నారు.
అయితే మార్గమధ్యంలో అమ్మాయిని అసభ్యంగా తాకుతూ, కల్వర్టు కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో, నిందితులు పరారయ్యారు.
ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా, మార్చి 17న విచారణ జరిపి, "మహిళ వక్షోజాలను తాకడం, దుస్తులను లాగడం మాత్రమే అత్యాచారం కిందకు రావు" అంటూ నిందితులకు అనుకూలంగా తీర్పునిచ్చారు.
వివరాలు
వివాదాస్పద తీర్పుపై తీవ్ర స్పందన
ఈ తీర్పు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని న్యాయనిపుణులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి కూడా స్పందిస్తూ, "ఇలాంటి తీర్పుల వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకోవాలి" అని అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, సుప్రీంకోర్టు స్వయంగా (సుమోటోగా) విచారణ చేపట్టి, హైకోర్టు తీర్పును నిలిపివేసింది.