Isha Foundation: ఈశా ఫౌండేషన్ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
మహిళలను సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశా ఫౌండేషన్ (Isha Foundation) ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు పోలీసుల నుంచి ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఫౌండేషన్ ఈ కేసు విషయంలో సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫౌండేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశించింది. అదేవిధంగా, పోలీసుల నుంచి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోరింది. ఈ కేసు నేపథ్యంలో ఇద్దరు యువతుల తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ చేశారు.
మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు
కోయంబత్తూరులో ఉన్న ఈశా యోగా కేంద్రంలో తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలంటూ కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమార్తెలు గీత, లత యోగా నేర్చుకోవడానికి ఈశా కేంద్రానికి వెళ్లి, అక్కడే ఉండిపోయారని కామరాజ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, కోయంబత్తూరు న్యాయమూర్తికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పిటిషనర్ అభ్యర్థనలో, తన కుమార్తెలు ఈశా యోగా కేంద్రంలో నిర్బంధించబడి చిత్రహింసలు అనుభవిస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.
జగ్గీ వాసుదేవ్ కుమార్తెకు వివాహం.. ఇతరుల పిల్లలను సన్యాసులను చేయడంపై ప్రశ్నలు
తాను ఫౌండేషన్‌పై ఏవైనా ఆందోళనలు చేపడితే, తన రెండో కుమార్తె చనిపోయేవరకు నిరాహారదీక్ష చేపడతానని హెచ్చరించిందన్నారు. తన కుమార్తెలు బయటకు వస్తే, వారిని ఇబ్బందిపెట్టకుండా వారి ఏకాంతాన్ని కాపాడుతానని పిటిషనర్ తెలిపారు. విచారణలో భాగంగా, న్యాయమూర్తులు జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసిన ఫోటోను పరిశీలించి, ఇతరుల పిల్లలను సన్యాసులను చేయడంపై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, ఈశా ఫౌండేషన్ తమ ప్రకటనలో, పెళ్లి చేసుకోమని లేదా సన్యాసం కావాలని ఎవ్వరినీ కోరడం లేదని స్పష్టం చేసింది. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ, సుప్రీం కోర్టును ఆశ్రయించింది.