Supreme Court: కాలుష్యంపై ప్రచారానికి విరాట్ కోహ్లీని రంగంలోకి దించండి.. సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో టపాసుల విక్రయాలు, వినియోగంపై కొనసాగుతున్న ఆంక్షల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టపాసులపై నిషేధాన్ని కొనసాగించాలా? లేక ఆంక్షలను సడలించాలా? అనే అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, పూర్తిస్థాయి నిషేధం విధించడం కంటే ఇప్పటికే ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. వాయు కాలుష్యంపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సలహా ఇచ్చింది. గురువారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాఠేలతో కూడిన ధర్మాసనం ఈ అంశానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపింది.
వివరాలు
నిబంధనలను ఉల్లంఘించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం
కాలుష్య నియంత్రణకు సంబంధించి ఏటా ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ,అవి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
అమలు లోపాల కారణంగా ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని పేర్కొంది.
నిబంధనలను ఉల్లంఘించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అభిప్రాయపడింది.
విచారణ సందర్భంగా న్యాయవాది అపరాజిత సింగ్ టపాసుల వల్ల కలిగే నష్టాలను కోర్టుకు వివరించారు.
బాణసంచా కాల్చడం వల్ల అత్యంత ప్రమాదకరమైన పీఎం2.5సూక్ష్మ ధూళి కణాలతో పాటు విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయని తెలిపారు.
ఈ కాలుష్య కారకాలు రక్తంలో కలవడం ద్వారా శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు.
పొగతాగే అలవాటు లేనివారితో పాటు చిన్నపిల్లల్లోనూ ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వివరాలు
గ్రీన్ క్రాకర్స్‌పైనా సందేహాలు
మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ పేరుతో విక్రయిస్తున్న టపాసుల ప్రామాణికతపైనా అపరాజిత సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు.
వాటిపై ఉండాల్సిన క్యూఆర్ కోడ్‌లు సరిగా పనిచేయడం లేదని, దీంతో అవి నిజమైన గ్రీన్ క్రాకర్సా? కాదా? అనేది గుర్తించడం కష్టంగా మారుతోందని పేర్కొన్నారు.
సీఎస్ఐఆర్-నీరి సంస్థ అభివృద్ధి చేసిన అసలైన గ్రీన్ క్రాకర్స్ సైతం సాధారణ టపాసులతో పోలిస్తే 30 శాతం తక్కువ కాలుష్యాన్నే విడుదల చేస్తాయని వివరించారు.
అంతేకానీ, అవి పూర్తిగా కాలుష్యరహితమైనవి కావని స్పష్టం చేశారు.
వివరాలు
సంపూర్ణ నిషేధం వద్దంటున్న తయారీదారులు
మరోవైపు, టపాసుల వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోందని పిటిషనర్లు వాదించారు.
బాణసంచాకు మతపరమైన ప్రాధాన్యత లేదని, అందువల్ల వాటిపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని కోరారు.
అయితే, టపాసుల తయారీదారులు ఈ వాదనను వ్యతిరేకించారు. సంపూర్ణ నిషేధం విధిస్తే అక్రమ విక్రయాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
బ్లాక్ మార్కెట్ ద్వారా మరింత ప్రమాదకరమైన టపాసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు.
వివరాలు
అధికారుల అమలుపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం,వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) తీసుకుంటున్న చర్యలను కూడా ధర్మాసనం పరిశీలించింది.
యాంటీ స్మాగ్ గన్‌ల ఏర్పాటు,వాహనాల నుంచి వెలువడే కాలుష్యఉద్గారాల తనిఖీ వంటి చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
అయితే,కాలుష్యాన్నిపర్యవేక్షించే కేంద్రాలు తగినన్ని లేకపోవడం,నిబంధనల అమలుకు సంబంధించిన సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంపై కోర్టు ప్రశ్నలు సంధించింది.
క్షేత్రస్థాయిలో నిబంధనలు అమలు చేయకపోతే ఎన్నిఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం ఉండదని ధర్మాసనం హెచ్చరించింది.
మొత్తంగా టపాసులపై సంపూర్ణ నిషేధం విధించే విషయంలో సుప్రీంకోర్టు సుముఖంగా లేనట్లు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
అయితే,అనుమతించిన సమయాల్లోనూ నిబంధనలను ఉల్లంఘించకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
ఈ అంశంపై తుది నిర్ణయాన్ని కోర్టు రిజర్వ్ చేసింది.