
Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు
ఈ వార్తాకథనం ఏంటి
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం కలకలం రేపింది. పాఠశాల తాగునీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపినట్లు తెలిసింది.
అంతే కాకుండా మధ్యాహ్న భోజనం (ఎంఐడ్డీ మిల్) వంటకు ఉపయోగించే సామగ్రిపై కూడా అదే మందును చల్లినట్లు అధికారులు తెలిపారు.
శనివారం, ఆదివారం సెలవుల నేపథ్యంలో పాఠశాల సిబ్బంది వంట గదికి తాళం వేసి వెళ్లారు.
సోమవారం ఉదయం వంట ఏర్పాట్ల కోసం పాత్రలు కడుగుతుండగా వాటి నుంచి దుర్వాసన రావడంతో పాటు నురగలు కూడా ఏర్పడ్డాయి. దీంతో వారు అనుమానం చెందారు.
ఆ వెంటనే చుట్టూ గమనించగా పురుగుల మందు డబ్బా ఒకటి కనిపించింది.
Details
పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్ మాస్టర్
తాగునీటి ట్యాంకును పరిశీలించగా అందులోనూ అదే మందు కలిపినట్లు గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను తాగునీటి కుళాయిలకు వెళ్లకుండా ఆపారు.
మధ్యాహ్న భోజనాన్ని వండకుండా ముందస్తుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల పాఠశాలలో ఉన్న దాదాపు 30 మంది విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
పాఠశాల హెడ్‌మాస్టర్ ప్రతిభ ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.