Page Loader
సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200 ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ

సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ

వ్రాసిన వారు Stalin
Feb 23, 2023
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

సికింద్రాబాద్‌లోని మౌలా-అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జెడ్ఆర్‌టీఐ)లో గల 200 సంవత్సరాల పురాతన వారసత్వ మెట్ల బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ బావి ఐదు దశాబ్దాలుగా జోనల్ రైల్వే శిక్షణా సంస్థ నీటి అవసరాలను తీరుస్తోంది. దాదాపు రూ.కోటి వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దాదాపు 50 అడుగుల లోతు ఉన్న ఈ హెరిటేజ్ బావి రోజుకు 1లక్ష లీటర్ల నీటిని అందిస్తోంది. మౌలా-అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ తోపాటు సూపర్‌వైజర్స్ ట్రైనింగ్ సెంటర్, టెరిటోరియల్ క్యాంప్‌ల నీటి అవసరాలను ఈ పురాతన బావి తీరుస్తోంది.

సికింద్రాబాద్

పెయింటింగ్, ఎల్ఈడీ లైటింగ్‌‌తో సుందరీకరణ

ఆధునికీకరణలో భాగంగా బావిని నైలాన్ మెష్‌తో కప్పారు. నీటిలో ఆకులు, ఇతర పదార్థాలు పడిపోకుండా నీటిని శుభ్రంగా ఉంచడంలో నైలాన్ మెష్‌ సహాయపడుతుంది. మాన్యువల్ క్లోరినేషన్‌కు కూడా ఇది ఉపయోగించబడుతుంది. ఈ వారతస్వ బావి నిర్వహణ, శుభ్రపరిచే పనులను నిర్వాహకులు నిత్యం చేపడుతున్నారు. అతిపురాతనమైన ఈ బావిని అందంగా అలంకరించారు. పెయింటింగ్ తోపాటు ఎల్ఈడీ లైటింగ్‌లతో సుందరీకరించారు. పురాతనమైన ఈ బావి పునరుద్ధరణ కోసం చొరవ తీసుకున్న అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. నిజాం హయాంలో సాలార్ జంగ్ ఖీ హైదరాబాద్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మామిడి తోటలకు నీటిని అందించేందుకు ఈ బావిని తవ్వించారు.