రేపు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి
ఐటీ సిటీ హైదరాబాద్‌ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గర్వం, సౌకర్యం, కనెక్టివిటీకి పర్యాయపదమని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు ఇది రెండో ట్రైన్ అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం సేవలను అందిస్తోంది.
టిక్కెట్ ధరలు రూ. 1150తో ప్రారంభం
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది. ఇది 8 గంటల 30 నిమిషాల్లో 660.77 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం మినహా మిగతా రోజుల్లో నడుస్తుంది. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే ఆగుతుంది. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్ ధర రూ. 1150 (జీఎస్టీ, తత్కాల్ సర్‌చార్జితో కలిపి)తో ప్రారంభమవుతుంది. అయితే వాస్తవమైన ఛార్జీలను వివరంగా రైల్వే శాఖ ఇంకా ప్రకటించలేదు.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్
సికింద్రాబాద్ - తిరుపతి (20701) సికింద్రాబాద్ - ఉదయం 6గంటలకు ప్రారంభం నల్గొండ - ఉదయం 07.19 గుంటూరు - 09.45 గంటలు ఒంగోలు - 11.09 గంటలు నెల్లూరు - 12.29 గంటలు తిరుపతి - మధ్యాహ్నం 14.30గంటలు తిరుపతి - సికింద్రాబాద్ (20702) తిరుపతి - మధ్యాహ్నం 15.15 గంటలకు ప్రారంభం నెల్లూరు - రాత్రి 17.20 గంటలు ఒంగోలు - రాత్రి 18.30 గంటలు గుంటూరు - రాత్రి 19.45 గంటలు నల్గొండ - రాత్రి 22.10 గంటలు సికింద్రాబాద్ - రాత్రి 23.45 గంటలు