Page Loader
సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ 
సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ

సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ 

వ్రాసిన వారు Stalin
Apr 21, 2023
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వే నడుపుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రూట్లలో టిక్కెట్లు దొరకడం కూడా కష్టంగా మారుతోంది. అందులో ప్రధానంగా సికింద్రాబాద్-తిరుపతి రైలుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కేవలం 8బోగీలు మాత్రమే ఉన్నాయి. దీంతో అనేక మంది ప్రయాణికులకు రిజర్వేషన్లు లభించడం లేదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వెయిటింగ్ లిస్ట్ 10 రోజులు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలులో కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకున్నారు. 16 కోచ్‌లతో రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం.

వందేభారత్

త్వరలో బోగీల సంఖ్య రెట్టింపు 

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో 16 కోచ్ లతో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న బోగీల సంఖ్య రెట్టింపు కానుంది. అయితే అదనపు బోగీలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చూడాలి. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు మంగళవారం మినహా 6 రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తిరుమల వెళ్లే భక్తులకు ఈ సెమీ హైస్పీడ్ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.