భద్రతలో వైఫల్యం: ప్రధాని మోదీపైకి దూసుకొచ్చిన యువకుడు
కర్ణాటకలో జరుగుతున్న జాతీయ యువజనోత్సవాల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో ఘోర వైఫల్యం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు హుబ్బళికి మోదీ చేరుకోగా.. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో భాగంగా రోడ్డుపై ఉన్న ప్రజలకు మోదీ అభివాదం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో.. ఒక వ్యక్తి అకస్మాత్తుగా మోదీ కారు వద్దుకు ఒక్కసారిగా దూసుకొచ్చాడు. కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని దాటుకొని.. ఆ యువకుడు ఒక్కసారి దూసుకొని రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు మోదీకి పూలదండ వేసేందుకు ప్రయత్నించగా.. ఎన్ఎస్‌జీ సిబ్బంది అతడిని ఒక్కసారిగా లాగేశారు.
భద్రతా ఉల్లంఘన అవాస్తవం: కర్ణాటక పోలీసుల వివరణ
మోదీ కారు వద్దకు యువకుడు దూసుకొచ్చిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారడంతో.. దీనిపై కర్ణాటక పోలీసులు స్పందించారు. ప్రధాని మోదీ పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం జరగలేదని పేర్కొన్నారు. రోడ్ షో అనంతరం హుబ్బళిలోని రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్‌లో యూత్ ఫెస్టివల్‌ను మోదీ ప్రారంభించారు. దాదాపు 30వేల మంది యువత ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. యువకుడు తీసుకొచ్చిన పూలదండను మోదీ తన వాహనంపైనే ఉంచినట్లు రోడ్ షోను కొనసాగించినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.