చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి: స్వామి చక్రపాణి మహారాజ్
ప్రపంచ దేశాలు చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అన్నారు. చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో వీడియో సందేశం పంపించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రాంతానికి "శివశక్తి పాయింట్" అని పేరు పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత శివశక్తి పాయింట్‌ను రాజధానిగా అభివృద్ధి చేయాలని అన్నారు. ఇలా చేయడం వల్ల జిహాదీ మనస్తత్వంతో ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోలేడన్నారు.
గతంలో కూడా విచిత్రమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన చక్రపాణి
హిందూ ధర్మకర్త స్వామి చక్రపాణి మహారాజ్ గతంలో కూడా తన విచిత్రమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. 2020లో స్వామి చక్రపాణి మహారాజ్, అతని సంస్థ ఆల్ ఇండియా హిందూ మహాసభ, కోవిడ్-19 మహమ్మారి మొదటి వేవ్ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఆ సమయంలో 'గౌమూత్ర పార్టీ'ని నిర్వహించి అప్పట్లో ఆయన సంచలనం రేపారు. 2018లో ఎద్దు మాంసం తిన్న కేరళ వరద బాధితులకు సహాయం చేయకూడదని పిలుపునిచ్చి వివాదాస్పమయ్యారు. ఇదిలా ఉంటే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని సందర్శించిన సందర్భంగా, చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని 'శివశక్తి'గా పిలుద్దామని చెప్పిన విషయం తెలిసిందే.