Loading...
Supreme Court: స్వయం ప్రకటిత జర్నలిస్టులకు గుర్తింపు పొందిన వారితో సమాన రక్షణ ఉండదు: సుప్రీంకోర్టు
స్వయం ప్రకటిత జర్నలిస్టులకు గుర్తింపు పొందిన వారితో సమాన రక్షణ ఉండదు: సుప్రీంకోర్టు

Supreme Court: స్వయం ప్రకటిత జర్నలిస్టులకు గుర్తింపు పొందిన వారితో సమాన రక్షణ ఉండదు: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వయం ప్రకటిత జర్నలిస్టులకు, అధికారికంగా గుర్తింపు పొందిన పాత్రికేయులతో సమానమైన రక్షణ లభించకపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జర్నలిస్ట్ అనే హోదాను ఎవరికి వారు ప్రకటించుకుంటే సరిపోదని స్పష్టం చేసింది. ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది.

వివరాలు 

నిరసనల కవరేజీలో పోలీసుల తీరుపై పిటిషన్లు

కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

నిరసనలు జరుగుతున్న ప్రాంతాల నుంచి తమ విలేకరులను పోలీసులు బలవంతంగా తొలగించారని, ఘటనలను చిత్రీకరించకుండా అడ్డుకున్నారని, కొందరిపై భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారని ఆ సంఘాలు ఆరోపించాయి.

గత నెలలో ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో పోలీసుల ప్రవర్తన, అత్యుత్సాహంపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కుతో పాటు వాటిని వార్తలుగా ప్రజలకు అందించే మీడియా స్వేచ్ఛపై ఈ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది.

వివరాలు 

జర్నలిస్ట్ హోదాను ఎవరికి వారు ప్రకటించుకోలేరు

విచారణ సందర్భంగా జర్నలిస్టుల గుర్తింపు, వారికి కల్పించాల్సిన రక్షణపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

జర్నలిస్ట్ అనే హోదాను ఎవరికి వారు ఇచ్చుకోలేరని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ స్పష్టం చేశారు.

ప్రింట్ మీడియాకు చెందిన విలేకరులు ప్రెస్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందినవారై ఉండాలని, టీవీ ఛానళ్లలో పనిచేసే వారికి కూడా సంబంధిత గుర్తింపు ఉండాలని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ మీడియా జర్నలిస్టులకు సైతం తగిన గుర్తింపు లేదా రిజిస్ట్రేషన్ ఉండే అవకాశం ఉందని వివరించారు.

ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే జర్నలిస్టుల హోదాను నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు.

అధికారికంగా గుర్తింపు పొందిన పాత్రికేయులకు కల్పించే రక్షణ స్వయం ప్రకటిత జర్నలిస్టులకు అదే స్థాయిలో వర్తించకపోవచ్చని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

జర్నలిస్ట్ హోదాను ఎవరికి వారు ప్రకటించుకోలేరు

అక్టోబర్ 10, 11 తేదీల్లో ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న సమయంలో విలేకరులను అదుపులోకి తీసుకోవడం, వారిపై దాడులు చేయడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను ఉన్నత స్థాయి కమిటీకి అప్పగించాలని ధర్మాసనం నిర్ణయించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

రీల్ మేకర్లు కూడా జర్నలిస్టులేనా?

పాత్రికేయ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ పోలీసులు వారం క్రితం అఫిడవిట్ సమర్పించారు.

ఇందులో రీల్ మేకర్లు, కంటెంట్ క్రియేటర్లను కూడా జర్నలిస్టులుగా పరిగణించాలా? లేదా? అనే అంశంపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు.

మారుతున్న డిజిటల్ మీడియా పరిస్థితుల్లో చాలామంది వ్యక్తులు వివిధ అంశాలపై రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారని పోలీసులు వివరించారు.

కొందరు తమ కంటెంట్‌ను వాణిజ్యపరంగానూ వినియోగించుకుంటున్నారని తెలిపారు.

ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించడంలో అభ్యంతరం లేకపోయినప్పటికీ, వారందరికీ జర్నలిస్టులు లేదా రిపోర్టర్ల హోదా కల్పించవచ్చా? అనే ప్రశ్నపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేందర్ కుమార్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

ముందుగా జర్నలిస్టుకు నిర్వచనం ఇవ్వాలి

విచారణ సందర్భంగా అసలు జర్నలిస్ట్ అంటే ఎవరో ముందుగా నిర్వచించాల్సిన అవసరం ఉందని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ అన్నారు.

ప్రెస్ కౌన్సిల్ కింద నమోదైన వృత్తిపరమైన విభాగంలో పనిచేసేవారే జర్నలిస్టులా? రిజిస్టర్డ్ పత్రికలు లేదా టీవీ ఛానళ్లలో పనిచేసేవారే ఆ హోదాకు అర్హులా? లేక సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజల తరఫున గొంతు వినిపించాలని భావించే వ్యక్తులను కూడా జర్నలిస్టులుగా పరిగణించాలా? అనే ప్రశ్నలను ఆయన లేవనెత్తారు.

పత్రికా స్వేచ్ఛను కాపాడటంతో పాటు శాంతిభద్రతలు, చట్ట అమలును కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి వివరించారు.

నిరసనలను కవర్ చేసే జర్నలిస్టులతో పోలీసులు ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) రూపొందించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

వివరాలు 

ముందుగా జర్నలిస్టుకు నిర్వచనం ఇవ్వాలి

ఇందులో స్పష్టత లేని అంశాలు, సందిగ్ధ పరిస్థితులు ఎదురైనప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు.

నిరసనల సమయంలో ప్రజలను అక్కడి నుంచి తొలగించాల్సి వచ్చినప్పుడు జర్నలిస్టులు, రీల్ మేకర్ల మధ్య అప్పటికప్పుడు తేడా గుర్తించడం సాధ్యం కాదని ఓ న్యాయవాది వాదించారు.

దీనిపై జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ.. ఎస్ఓపీ రూపొందించినప్పటికీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలు అనుసరించే విధానం ఆయా వ్యక్తులు జర్నలిస్టులుగా చెప్పుకునే హోదా, వారి కార్యకలాపాల స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT