Page Loader
INDIA-US: సుంకాల ఆందోళన వేళ.. భారత్‌కు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి .. 
సుంకాల ఆందోళన వేళ.. భారత్‌కు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి ..

INDIA-US: సుంకాల ఆందోళన వేళ.. భారత్‌కు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి .. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2025
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్‌ లించ్‌ (Brendan Lynch) మార్చి 25 నుండి 29వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ అధిక సుంకాలు విధిస్తున్నందున, ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇతర దేశాలతో ట్రంప్‌ వాణిజ్య యుద్ధాలు కొనసాగిస్తున్న తరుణంలో, అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధిగా ఉన్న బ్రెండన్‌ లించ్‌, యూఎస్‌ అధికారుల బృందంతో కలిసి వచ్చే నెల భారత్‌కు రానున్నారు.

వివరాలు 

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల గురించి చర్చ 

ఐదు రోజుల పర్యటనలో భాగంగా, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, సుంకాల విధానం (Trade and Tariff) తదితర అంశాలపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ సహా ఇతర భారత అధికారులతో చర్చలు జరపనున్నారు. మార్కెట్ యాక్సెస్, లెవీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు పలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల గురించి కూడా చర్చించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారతదేశంతో పెట్టుబడి, వాణిజ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని, త్వరలో భారత అధికారులతో చర్చలకు ఎదురుచూస్తున్నామని బ్రెండన్‌ లించ్‌ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

సంప్రదింపుల ప్రాధాన్యత 

ట్రంప్‌ ప్రతీకార సుంకాల అమలుకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ అంశంపై పరిష్కారం కనుగొనేందుకు భారత్‌ కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఇరుదేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఓ వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించింది. ''పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కోసం అమెరికా యంత్రాంగంతో వివిధ స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు (INDIA-US) వాణిజ్య విస్తరణ, మార్కెట్ యాక్సెస్, సుంకాల తగ్గింపు, సప్లై-చైన్‌ సమన్వయం వంటి అంశాలపై దృష్టి పెట్టాయి'' అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.