LOADING...
Dharamasthala mass burials: 'ధర్మస్థల' కేసులో సంచలన ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్టు
'ధర్మస్థల' కేసులో సంచలన ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్టు

Dharamasthala mass burials: 'ధర్మస్థల' కేసులో సంచలన ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం (Dharamasthala mass burials) ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. ఆ శవాలను తానే పూడ్చిపెట్టానని చెప్పిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు, ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతడు అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించాడని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. గతంలోనే భీమా తన వాంగ్మూలం మార్చిన విషయం తెలిసిందే. ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా మృతదేహాలను పూడ్చానని చెప్పిన భీమా, వాటి ఆనవాళ్లు చూపకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వం, ప్రజలను తప్పుదారి పట్టించాడన్న ఆరోపణలపై సిట్ ప్రత్యేక బృందం అతడిని అదుపులోకి తీసుకుంది.

Details

సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మొహంతీ విచారణ

శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మొహంతీ అతడిని విచారించారు. మాయమాటలతో వ్యవస్థ మొత్తాన్ని నమ్మించాడని, కానీ చివరికి ఏమీ తెలియదని ఒప్పుకున్నాడని అధికారులు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేసి, నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తప్పుడు ఆరోపణలు చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆమె కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థల వెళ్లి అదృశ్యమైందని ఫిర్యాదు చేసినా, తాజాగా అది కట్టుకథే అని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి విచారణ జరిపి, త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.

Details

 కేసు వివాదం నేపథ్యం

ధర్మస్థల కర్ణాటకలో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి తరలివస్తారు. గతంలో అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు భీమా 1998 నుంచి 2014 మధ్య అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని సంచలన ఆరోపణలు చేశాడు. వారిని తానే పూడ్చానని పోలీసులకు తెలిపాడు. అదృశ్యమైన వారిలో కొందరు లైంగిక దాడులకు గురై చనిపోయి ఉండవచ్చని అన్నాడు.

Details

అబద్దాలు చెప్పినట్లు నిర్ధారణ

అంతేకాదు, 2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధించారని, దాంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని, చేసిన తప్పు వెంటాడటంతో తిరిగి బయటకు వచ్చి ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తవ్వకాలు జరపగా కొన్ని కళేబరాలు బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇటీవల భీమా మాట మార్చి, ఒకరు నాకు పుర్రె ఇచ్చి సిట్ అధికారులకు అందించమన్నారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నానని చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు భీమా అబద్ధాలను బయటపెట్టి, చివరికి అతడిని అరెస్టు చేశారు.