Karnataka Muda scam: ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యకు షాక్.. గవర్నర్ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో సంచలనం రేపిన ముడా స్కామ్ కేసులో, సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది.
గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ముడా స్కామ్‌లో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
గవర్నర్ ఆదేశాలను సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, హైకోర్టు తీర్పు వెల్లడించడంతో, బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
వివరాలు
గవర్నర్ సంచలన నిర్ణయం
మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూముల కేటాయింపుల వివాదంలో, ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనల ఆధారంగా రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.
అయితే, ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్‌చేసిన విషయం తెలిసిందే.