
Maharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో లోక్‌సభ సీట్ల పంపకంపై ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం, బుధవారం మహారాష్ట్రలో పర్యటిస్తుండటం రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది.
అమిత్ షా మంగళవారం అర్థరాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో వరుస సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాల్లో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చించారు. ఈ క్రమంలో గత ఎనిమిది గంటల్లో మిత్ర పక్షాల నేతలతో అమిత్ షా రెండోసార్లు భేటీ అయ్యారు.
బుధవారం ఉదయం కూడా శివసేన(షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) నేతలు షాను కలిశారు.
అమిత్ షా
సీట్లు డిమాండ్ చేసేటప్పుడు సహేతుకంగా ఉండాలి: అమిత్ షా
ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో బుధవారం షిండే, అజిత్ పవార్‌తో అమిత్ షా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలకు అమిత్ షా కీలక సూచనలు చేశారు.
ఇద్దరు నాయకులు దూకుడు మానుకోవాలని, సీట్లు డిమాండ్ చేసేటప్పుడు సహేతుకంగా ఉండాలని సూచించారు.
బీజేపీ మార్చి 2న లోక్‌సభ ఎన్నికల కోసం 195మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.
ఆ జాబితాలో మహారాష్ట్రకు సంబంధించి ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.
సీట్ల పంపకం కొలిక్కి వచ్చాక.. రెండో జాబితాలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరాఠా రిజర్వేషన్ సమస్యకు కేంద్రబిందువైన మరాఠ్వాడా ప్రాంతంలోని సంభాజీనగర్‌లో మంగళవారం షా పర్యటించారు.
అనంతరం 20ఏళ్లుగా శివసేన కంచుకోటగా ఉన్న సంభాజీనగర్‌లో రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించారు.
మహారాష్ట్ర
ఎవరు ఎన్ని సీట్లు పొందవచ్చు?
ఎన్‌డీటీవీ నివేదిక ప్రకారం.. బీజేపీ తన అభ్యర్థులను 30స్థానాల్లో నిలబెట్టాలని చూస్తోంది. శివసేనకు 12సీట్లు, ఎన్సీపీకి 6సీట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం గత లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన 23 స్థానాలను డిమాండ్ చేస్తోంది.
శివసేనలో చీలిక కారణంగా.. గతసారి గెలిచిన 18 స్థానాలను అయినా తమకు ఇవ్వాలని షిండే వర్గం డిమాండ్ చేస్తోంది.
మరోవైపు ఎన్సీపీ 10 సీట్లను అడుగుతోంది. ఎన్సీపీ చీలక ముందు, గత ఎన్నికల్లో 19 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
అయితే గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు సీట్లతో పాటు మరో 2 సీట్లను అదనంగా ఇవ్వాలని బీజేపీ భావిస్తోందట.
మహారాష్ట్ర
ఏయే సీట్లలో సమస్య ఉంది?
కళ్యాణ్, సౌత్ ముంబై, రత్నగిరి, షిరూర్, అమరావతి, శంభాజీనగర్ నగర్, హింగోలి, నాసిక్, రామ్‌టెక్, మావల్ సీట్ల విషయంలో సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది.
శివసేన మాజీ ఎంపీ ఆనంద్ రావ్ అద్సుల్ అమరావతి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుండగా, ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణాను బరిలోకి దింపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
కళ్యాణ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు.
శివసేనకు చెందిన అరవింద్ సావంత్ దక్షిణ ముంబై నుంచి ఎంపీగా ఉన్నారు. బీజేపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.