Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై 'శీష్‌మహల్' తరహా అభియోగం.. బంగ్లా పునరుద్ధరణపై రూ.2.6 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటికే ముడా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు.
ఆయన అధికారిక నివాసాన్ని 'శీష్ మహల్' తరహాలో పునరుద్ధరించేందుకు ప్రజాపనుల విభాగం సుమారు రూ.2.6 కోట్లు ఖర్చు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఒకవైపు ప్రభుత్వం నిధుల కొరతను సాకుగా చెప్పుతూనే, మరోవైపు అధికారి తరఫున అనవసర ఖర్చులు పెంచుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ ఆక్షేపించారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఇతర ప్రాజెక్టులు పూర్తయ్యాకనే ముఖ్యమంత్రి తన వ్యక్తిగత అవసరాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ప్రజలు ప్రభుత్వ సహాయానికి ఎదురుచూస్తున్న వేళ, నిధులను వ్యర్థ ఖర్చులకు మళ్లించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
వివరాలు
తీవ్ర స్థాయిలో మండిపడుతున్న ప్రతిపక్ష నేతలు
ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సీఎంపై వచ్చిన ఆరోపణల ప్రకారం,ఆయన అధికారిక భవనం పునర్నిర్మాణానికి రూ.1.7 కోట్లను హెల్పర్ గదులు,ఇతర నిర్మాణాలకు కేటాయించగా,రూ.89 లక్షలను ఎలక్ట్రికల్ అప్‌గ్రేడ్,ఎయిర్ కండిషనింగ్ వంటి సదుపాయాల కోసం వినియోగించినట్లు ఆర్థికశాఖ నివేదికలు వెల్లడించాయి.
దీనిపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇంతకు ముందే మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జునపై కేసులు నమోదు కాగా, లోకాయుక్త ఎస్‌పీ టి.జె.ఉదేశ్ నేతృత్వంలో విచారణ మొదలైంది.
అయితే, తాజా దర్యాప్తులో లోకాయుక్త పోలీసులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.
వివరాలు
ఆప్ పార్టీ ఓటమిలో కీలక పాత్ర వహించిన 'శీష్ మహల్' వివాదం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 'సీఎం బంగ్లా' వివాదం పెద్ద రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.
ఆ బంగ్లాను 'శీష్ మహల్'గా అభివర్ణించిన బీజేపీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సీఎం 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది.
ఆప్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, 'శీష్ మహల్' వివాదం ఆ పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.