Shrikant Shinde: "నేను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తునట్లు వస్తున్న వార్తలు అవాస్తవం": శ్రీకాంత్ షిండే
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో తనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి అందజేయబోతున్నారనే వార్తలపై ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ శిందే స్పష్టతనిచ్చారు. ఇలాంటి వార్తలు పూర్తిగా అసత్యమని, అవన్నీ వదంతులేనని ఆయన చెప్పారు. మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు విస్తృతంగా పుకార్లు వ్యాపిస్తున్నాయని, అవి నిరాధారమైనవని అన్నారు. తండ్రి ఏక్‌నాథ్ శిందే ఆరోగ్య కారణాల వల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.
మహాయుతి ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం
''లోక్‌సభ ఎన్నికల తర్వాత నాకు కేంద్ర మంత్రిపదవికి అవకాశం వచ్చింది.అయితే,పార్టీ కోసం పనిచేయడమే ముఖ్యమని భావించి ఆ అవకాశం వదులుకున్నాను.నాకు పదవులపై ఎలాంటి ఆసక్తి లేదు.నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి మంత్రి పదవి రేసులో లేను. శివసేనతో పాటు నా లోక్‌సభ నియోజకవర్గ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను.నా గురించి జరుగుతున్న చర్చలు ఇప్పటికైనా ఆగిపోతాయని ఆశిస్తున్నాను,'' అని శ్రీకాంత్ శిందే స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ,మహాయుతి ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. కూటమి పార్టీల మధ్య పదవుల పంపిణీపై విభేదాలే ఈ ఆలస్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి దేవేంద్ర ఫడణవీస్‌కు ఖరారైనప్పటికీ,డిప్యూటీ సీఎం పదవి శ్రీకాంత్ శిందేకి ఇవ్వనున్నారని వస్తున్న వార్తలపై ఆయన తేల్చిచెప్పారు.