ఎస్‌ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టిన భార్య పిల్లలు
ఓ సెల్ఫీ ఫొటో పోలీస్ అధికారిని కష్టాలపాలు చేసింది. రూ. 14 లక్షల నోట్ల కట్టలను కుప్పలుగా పోసిన ఓ ఎస్సై భార్య,పిల్లలు వాటితో సెల్ఫీదిగారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్ చంద్ర సహాని సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు. అయితే ఇటీవల ఎస్ఐ సహాని భార్యా , పిల్లలు వారి ఇంట్లోని రూ.500 నోట్ల కరెన్సీ కట్టలతో సెల్ఫీ దిగారు. అనంతరం సెల్ఫీని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కాస్త వైరల్ అయ్యింది. విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కంగుతున్న సీనియర్ ఆఫీసర్లు ఎస్సై సహానిపై విచారణకు ఆదేశించారు.
ఫోట్ వైరల్ అవుతున్న అంశం మా దృష్టికి వచ్చింది : పోలీస్ ఉన్నతాధికారి
ఈ క్రమంలో సహానిని వెంటనే వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలోని రూ. 14 లక్షలపై ఎస్‌ఐ సహాని వివరణ ఇచ్చారు. ఆ ఫోటో నవంబర్ 14, 2021న కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీసుకున్నామని తెలిపాడు. మరోవైపు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాన్ని తాము గుర్తించినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి చెప్పాడు. సదరు పోలీస్ భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారిస్తున్నామన్నారు. సదరు ఫోటోలో సహాని భార్య, పిల్లలు ఉన్నారని, వారు నోట్ల కట్టలను చూపిస్తూ ఫోజులు ఇచ్చారన్నారు. దీని ఆధారంగా సహానిపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామన్నారు.