సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి ఆగి ఉన్న రెండు బస్సులను ఢీకొనడంతో 14 మంది మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రేవా-సత్నా సరిహద్దులోని మోహనియా సొరంగం సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఢీకొన్న ప్రమాదంలో ఓ బస్సు బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
మధ్యప్రదేశ్
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
రేవా కమిషనర్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
శుక్రవారం సాత్నాలో నిర్వహించిన అమిత్ షా సభలో పాల్గొని బస్సులో తిరుగు ప్రయాణమైన క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ట్రక్కు టైరు పగిలిపోవడంతో అది అదుపు తప్పిందని వెల్లడించారు. వేగంగా వచ్చిన ట్రక్కు బస్సులను వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీని ప్రభావంతో బస్సు ఒకటి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది.
ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మృతుల కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.5లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.