తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్; ఒక్కరోజే 11,241 మెగావాట్ల వినియోగం
తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుందే కానీ, తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది. వానలు లేకపోవడం, ఎండలు మండిపోవడమే విద్యుత్ డిమాండ్ పెరగడానికి ప్రధానంగా కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి జూన్ నెలలో రోజూవారి విద్యుత్ వినియోగం 9వేల మెగావాట్లకు మించి ఉండదని గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతానికంటే భిన్నంగా మంగళవారం ఒక్కరోజే దాదాపు 11, 241 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2022లో జూన్ 20న విద్యుత్ వినియోగం కేవలం 8,344 మెగావాట్లు మాత్రమే ఉండటం గమనార్హం.
వ్యవసాయ రంగానికే ఎక్కువ వినియోగం
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు ఆలస్యం కావడం సాగుకోసం రైతులు విద్యుత్‌ను పెద్దఎత్తున వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగం వాటా 37 శాతం అని అధికారులు అంటున్నారు. దీనికితోడు కొత్త పరిశ్రమలు ఏర్పాటుతో ఫ్యాక్టరీల్లో కూడా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అలాగే ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతల నేపథ్యంలో ఇళ్లలో కూడా కరెంట్‌ను గతానికంటే ఎక్కువగా వినియోగిస్తున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ బోర్ల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు 27.54 లక్షలకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో, ఈ లెక్కలను చూస్తే అర్థం అవుతుంది.