తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్
దాదాపు దశాబ్దం పాటు భరించలేని నష్టాలను చవిచూసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో టీఎస్‌ఆర్టీసీ నష్టాలు భారీగా తగ్గాయి. రాబడిలో గణనీయమైన గణాంకాలను నమోదు చేసింది. 2021-22 ఏడాదిలో రూ.1986.58కోట్ల నష్టాలను చవిచూసిన ఆర్టీసీ తాజా ఆర్థిక సంవత్సరంలో రూ.672.29 కోట్ల నష్టాన్ని మాత్రమే నమోదు చేయడం గమనార్హం. ఈ గణాంకాలే తెలంగాణ ఆర్టీసీ నష్టాలు ఏ స్థాయిలో తగ్గాయో అర్థం అవుతుంది.
సంస్కరణ వల్లే తగ్గిన తగ్గిన నష్టాలు
ప్రస్తుతం ఆర్టీసీని మూడు జోన్లు, 10 రీజియన్లుగా పరిగణిస్తారు. అయితే వీటిలో ఏ ఒక్క రీజియన్ కూడా లాభాలను గడించలేదు. 10 రీజియన్లలో అతి తక్కువ నష్టాన్ని నల్గొండ జిల్లా నమోదు చేయడం గమనార్హం. ఈ రీజియన్‌లో నష్టాలు ఏకంగా 95శాతం తగ్గాయని ఆర్టీసీ తెలిపింది. గతేడాది లెక్కలను ఒకసారి పరిశీలిస్తే, ఆదాయం కంటే, ఖర్చే ఎక్కువగా ఉందని యాజమాన్యం గ్రహించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చిన సంస్కరణ వల్ల నష్టాలు చాలా వరకు తగ్గాయి. ఇందులో ఆర్టీసీ ఛార్జీల పెంపు, మెరుగైన కార్గో సేవలు వంటివి ఉన్నాయి.