
Ham radio: ఉగ్రకుట్ర సంకేతాలు..? బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రేడియో సిగ్నళ్ల కలకలం!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ దేశంలో ఉగ్రదాడుల కోసం కుట్ర జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేసింది.
రెండు నెలలుగా బంగ్లాదేశ్ యాసతో కూడిన ఉర్దూ, బెంగాలీ, అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు అందుతున్నాయని ఆ సంస్థ ఆపరేటర్లు గుర్తించారు.
బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయని అధికారులు తెలిపారు.
మరోసారి ఇలాంటి సిగ్నళ్లు అందితే వెంటనే తెలియజేయాలని హామ్ రేడియో ఆపరేటర్లకు సూచించారు.
Details
డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు
గతేడాది డిసెంబర్‌లో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్‌హట్, బొంగావ్, దక్షిణ 24 పరగణాలోని సుందర్‌బన్స్ ప్రాంతాల్లో హామ్ రేడియో ఆపరేటర్లు ఈ కోడ్ భాషలను గుర్తించారని సంస్థ వెల్లడించింది.
తొలుత వీటిని పెద్దగా పట్టించుకోలేకపోయినా, జనవరిలో గంగాసాగర్ మేళా సందర్భంగా వినియోగదారుల నుంచి అనుమానాస్పద సంకేతాలపై ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమై కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సంకేతాలను డీకోడ్ చేయడానికి కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్‌కు సమాచారం పంపినట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.
స్మగ్లర్లు, తీవ్రవాద గ్రూపులు రహస్య చర్చల కోసం ఇలాంటి కోడ్ భాషలను వినియోగించే అవకాశం ఉందని, వీటిని ట్రాక్ చేయడం కష్టం అయినా డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామని పేర్కొన్నారు.
Details
భద్రత విషయంలో హామ్ రేడియో కీలక పాత్ర
గతంలోనూ ఇలాంటి అనుమానాస్పద సంకేతాలు ట్రాక్ చేసి, 2002-03లో గంగాసాగర్‌లో అక్రమ రేడియో స్టేషన్‌లను నిర్వహిస్తున్న ఆరుగురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు.
2017లో బసిర్‌హట్‌లో మత ఘర్షణలు చెలరేగడానికి ముందే హామ్ రేడియో వినియోగదారులు అనుమానాస్పద సంకేతాల గురించి తెలియజేశారని తెలిపారు.
హామ్ రేడియో దేశ భద్రత విషయంలో అనేకసార్లు కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.