
Chandrababu: సింహాచలం ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
సింహాచలం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు.
బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు.
Details
క్షతగాత్రులపై అందుతున్న వైద్య సేవలపై ఆరా
ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, విశాఖ ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.
ప్రమాదం ఎలా జరిగింది? క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై సీఎం సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు.
తక్షణంగా విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ చర్యలన్నీ బాధితులకు తక్షణ సహాయం అందించడానికే అని సీఎం స్పష్టం చేశారు.