Singareni Coal: దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం
సింగరేణి బొగ్గు ఉత్పాదక వ్యయాలు అధికంగా ఉండటంతో దక్షిణ భారత రాష్ట్రాల విద్యుత్ సంస్థలపై భారీ ఆర్థికభారం పడుతోంది. ముఖ్యంగా మహానది కోల్‌ఫీల్డ్స్, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ సంస్థలతో పోలిస్తే, సింగరేణి బొగ్గు ధర సగటున 2 రెట్లు ఎక్కువగా ఉంది. సింగరేణిలోని బొగ్గు ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. సింగరేణి బొగ్గును నాణ్యత ఆధారంగా గ్రేడ్‌లవారీగా విక్రయిస్తారు. జీ5 గ్రేడ్ బొగ్గు సింగరేణి వద్ద టన్నుకు రూ. 5,685కి విక్రయిస్తే, మహానది రూ. 2,970కి, వెస్ట్రన్ రూ. 2,970కి అమ్ముతున్నారు. జీ16 గ్రేడ్‌కు, సింగరేణి రూ. 1,620కి విక్రయిస్తుండగా, మహానది రూ. 514, వెస్ట్రన్ రూ. 614కు అందిస్తోంది.
వ్యయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సింగరేణి ముఖ్యంగా జీ9, జీ10, జీ11, జీ12 గ్రేడ్‌ల బొగ్గును సరఫరా చేస్తోంది. అయితే ఈ గ్రేడ్‌ల బొగ్గు నాణ్యత తక్కువగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తిలో అధిక పరిమాణంలో వినియోగించాల్సి వస్తుంది. సింగరేణి గనులు తెలంగాణలో ఉన్నందున, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఇక్కడ బొగ్గు కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఇతర గనుల దూరంగా ఉన్నాయని, రవాణా వ్యయం ఎక్కువగా ఉండడంతో, తక్కువ ధరలో కొనుగోలు చేసినా మొత్తం ఖర్చులు ఎక్కువ అవుతాయి.
డిస్కం నష్టాలను భర్తీ చేయాలి
ఉదాహరణకు, భద్రాద్రి విద్యుత్ ప్లాంటులో కరెంటు ఉత్పత్తికి సగటున రూ. 5.50కి మించి వ్యయం అవుతోంది. 2024-25లో, సింగరేణి నుంచి సరఫరా చేసిన బొగ్గుకు, టన్నుకు సగటున రూ. 5,369 చొప్పున వసూలు చేశారు. కొత్తగూడెం 7వ దశ కొత్త ప్లాంటుకు, బొగ్గుకు టన్నుకు రూ. 6,449 చొప్పున చెల్లించారు. ఈ అధిక ధరలు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)పై భారీ ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. దీంతో ప్రజలకు కరెంటు సరఫరా చేయాలంటే సగటున యూనిట్‌కు రూ. 7.37 వ్యయం అవుతోంది. ఈ నేపథ్యంలో, ఇంజినీర్లు కరెంటు ఛార్జీలను పెంచాలని లేదా డిస్కం నష్టాలను భర్తీ చేయాలని సింగరేణి కంపెనీ అధికారి బలరాం తెలిపారు,