Komatireddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి: కోమటిరెడ్డి
నల్గొండ జిల్లాలో రిజర్వాయర్‌తో పాటు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ)సొరంగం పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం తెలిపారు. అమెరికాలోని ఒహియోలో టన్నెల్ బోరింగ్ పరికరాలకు పేరుగాంచిన రాబిన్స్ కంపెనీని కంపెనీ సీఈవో లాక్ హోంతో చర్చల సందర్భంగా ఆయన మాట్లాడారు. టన్నెల్ తవ్వకానికి వినియోగించే అధునాతన నిర్మాణ యంత్రాలను లాక్ ప్రదర్శించి,వాటి పనితీరును మంత్రికి వివరించారు. సొరంగం తవ్వకానికి వీలైనంత త్వరగా బోరింగ్,కట్టింగ్ స్పేర్ పార్ట్స్ అందించాలని తయారీదారుని మంత్రి అభ్యర్థించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తయితే పంపింగ్ అవసరం లేకుండా గ్రావిటీ ఫ్లో ద్వారా 3లక్షల ఎకరాలకు, ఉదయ సముద్రం ప్రాజెక్టులో భాగమైన బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు ద్వారా మరో లక్షఎకరాలకు సాగునీరు అందుతుందని వెంకట్‌రెడ్డి తెలిపారు.
గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రాజెక్టు పనులకు బిల్లు చెల్లింపులు
గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు,బేరింగ్ తో పాటు ఇతర రిపేర్లతో ఆగిపోయాయని మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టును త్వరగతిన పూర్తి చేసేందుకు.. ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రాజెక్టు పనులకు బిల్లు చెల్లింపులు చేసేలా నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. బేరింగ్, ఇతర స్పేర్ పార్ట్స్ ను వీలైనంత త్వరగా అందిస్తే.. వెంటనే చెల్లింపులు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన వివరించారు.
మంత్రి వివరణతో లాక్ హోం సంతృప్తి
మంత్రి ఇచ్చిన వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన లాక్ హోం SLBC టన్నెల్ కు ప్రధాన బేరింగ్, ఇతర కటింగ్ స్పేర్ పార్ట్స్ ను త్వరగానే అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మరో రెండు నెలల్లో 7 డయామీటర్ల బేరింగ్, ఇతర స్పేర్ పార్ట్స్ ను షిప్ ద్వారా చెన్నైకి చేర్చుతామని లాక్ హోం తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంట నల్లగొండ ఇరిగేషన్ శాఖ సీఈ అజయ్ కుమార్, జైప్రకాశ్ అసోసియేట్ కంపెనీ డైరెక్టర్ పంకజ్ గౌర్ అన్నారు.