Page Loader
SLBC tunnel: అంతుచిక్కని ఆచూకీ.. కానరాని ఎనిమిది మంది జాడ.. సహాయక చర్యలు ముమ్మరం
అంతుచిక్కని ఆచూకీ.. కానరాని ఎనిమిది మంది జాడ.. సహాయక చర్యలు ముమ్మరం

SLBC tunnel: అంతుచిక్కని ఆచూకీ.. కానరాని ఎనిమిది మంది జాడ.. సహాయక చర్యలు ముమ్మరం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు రెండవ రోజుకూ విఫలమయ్యాయి. భారత సైన్యం,జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సహా వివిధ బృందాలు విశ్వప్రయత్నాలు చేసినా,ఆశించిన ఫలితం దక్కలేదు. టీబీఎం యంత్రం సమీపానికి వెళ్లి బాధితుల పేర్లు ఉచ్చరించి పిలిచినా ఎలాంటి స్పందన రాలేదు. మొత్తం ప్రాంతం బురదతో నిండిపోవడం, టీబీఎం యంత్రం పైభాగం కుంగిపోవడం, ఇతర పరికరాలు అడ్డంగా పడిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో శనివారం పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సైన్యం, నౌకాదళం సహా రక్షణ బృందాలు విస్తృతంగా ప్రయత్నిస్తున్నాయి.

వివరాలు 

పరిస్థితిని సమీక్షిస్తున్న రేవంత్ రెడ్డి 

ఆదివారం వేకువజామునుంచి సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది టార్చిలైట్ల సహాయంతో లోనికి ప్రవేశించి సహాయక చర్యలు ప్రారంభించారు. డ్రోన్లు, స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపలి పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీ క్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ మంత్రులు, ఉన్నతాధికారులతో అనుసంధానంగా ఉంటున్నారు. కార్మికులను రక్షించేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.

వివరాలు 

డ్రోన్, స్కానర్లు,నైట్ విజన్ కెమెరాలతో అన్వేషణ

గంటగంటకూ ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. శ్రీశైలం జలాశయం వైపు 14వ కిలోమీటరులో చోటుచేసుకున్న ఈ ప్రమాదం కార్మికులను కాపాడటం మరింత క్లిష్టతరం చేసింది. ప్రమాదం జరిగి 40 గంటల పైగా గడిచినా ఎలాంటి సానుకూల పరిణామాలు కనిపించలేదు. పైకప్పు కూలిన సమయంలో సన్నీసింగ్, గురుప్రీత్‌ సింగ్, సంతోష్‌ సాహు, అనూజ్‌ సాహు, జక్తాజస్, సందీప్‌ సాహు, మనోజ్‌కుమార్, శ్రీనివాస్‌ లాంటి కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. వీరు ఎక్కడైనా రక్షణ పొందివుంటారని ఆశిస్తున్నారు. రక్షక బృందాలు డ్రోన్, స్కానర్లు,నైట్ విజన్ కెమెరాలతో అన్వేషణ కొనసాగించాయి. టీబీఎం యంత్రం దగ్గరకు చేరుకున్న రక్షక బృందాలు బురదలోకి దిగేందుకు ప్రయత్నించాయి, కానీ అధిక చీకటి, బురద కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది.

వివరాలు 

భారీ మోటార్ల ద్వారా నీటి తొలగింపు 

దూరం నుంచి బాధితులను బిగ్గరగా పిలిచి స్పందన రావాలనే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. టీబీఎం పనిచేసే సమయంలో మట్టి, రాళ్లను తొలగించే కన్వేయర్ బెల్ట్ ఇప్పుడు సహాయక చర్యలకు ఉపయోగపడుతోంది. లోకోరైలు ద్వారా సొరంగంలో రాకపోకలు సాగిస్తున్నారు. సహాయక చర్యలలో ఓర్వలేని ప్రతిబంధకాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నారు.ప్రమాదస్థలం నుంచి మూడు కిలోమీటర్ల వెనుక నీరు,బురద ప్రవహించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారీ మోటార్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు. ఐదు హై-కెపాసిటీ పంపులను వినియోగిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేని చోట ఇనుప కడ్డీలను తొలగించేందుకు కట్టర్లు ఉపయోగిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో వినియోగించే భారీ జనరేటర్‌ను తెప్పించి,శక్తివంతమైన లైట్లు ఏర్పాటు చేశారు.

వివరాలు 

హై ఫ్రీక్వెన్సీ పరికరాలతో ప్రత్యేక యాంటెనాల ఏర్పాటు

సాయంత్రానికి లోపల ఉన్న ఇనుప కడ్డీలను తొలగించే పనులు ప్రారంభించారు. వీటిని తొలగించిన తరువాతనే రక్షక బృందాలు ప్రమాదస్థలానికి వెళ్లగలవని ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడింది. హై ఫ్రీక్వెన్సీ పరికరాలతో ప్రత్యేక యాంటెనాలు ఏర్పాటు చేశారు. అయినా సంకేతాలు పరిమితంగానే అందుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.సొరంగంలోని విద్యుత్,సమాచార వ్యవస్థల వైర్లు దెబ్బతిన్నాయి. మంత్రులు ఉత్తమ్,జూపల్లి కృష్ణారావులు సైన్యం,ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించారు. భూభాగం నుంచి రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించడంపై చర్చించారు.సొరంగం మ్యాప్‌లు తెప్పించి పరిశీలించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, విపత్తుల నిర్వహణ కమిషనర్ అర్వింద్‌కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిస్థితిని సమీక్షించారు.

వివరాలు 

సహాయక చర్యలలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ

కేంద్ర ప్రభుత్వ సహాయంతో విశాఖపట్నం నుంచి మూడు నేవీ హెలికాప్టర్ల ద్వారా నౌకాదళం సభ్యులను పంపారు. హెలికాప్టర్ల ద్వారా ముందుగా సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు.భూగర్భ గనుల్లో రక్షణ చర్యలపై అవగాహన కలిగిన సింగరేణి విపత్తు నిర్వహణ బృందం పరికరాలతో సహాయానికి వచ్చింది. మొత్తం సహాయక చర్యలలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 130 మంది, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ 120 మంది, ఆర్మీ 24 మంది, సింగరేణి 24 మంది,హైడ్రా 24 మంది పాల్గొన్నారు. ఆదివారం రక్షణ బృందాలు సొరంగంలోకి వెళ్లాయి. ఆర్మీ ఐదుగురు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 15 మంది, మంత్రి జూపల్లి కృష్ణారావు,ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ అజయ్‌కుమార్,నిర్మాణ సంస్థ ప్రతినిధులు 10 మంది లోకోరైలు ద్వారా లోపలికి వెళ్లారు.

వివరాలు 

 నీరు, బురద తొలగించిన తరువాతనే కార్మికుల ఆచూకీ 

టీబీఎంకు సమీపంగా వ్యాగన్ల ద్వారా ప్రయాణం సాధ్యం కాకపోవడంతో కన్వేయర్ బెల్టుపై ప్రయాణించి ముందుకు వెళ్లారు. బురదతో కూడిన తీవ్ర స్థితిలో కూడా టీబీఎం సమీపానికి చేరుకున్నారు. అయితే, అక్కడ కార్మికుల జాడ కనిపించలేదు. టీబీఎం యంత్రం పై అంతస్తు పూర్తిగా కిందకు కుంగిపోయినట్లు రెస్క్యూ టీం తెలిపింది. నీరు, బురద తొలగించిన తరువాతనే కార్మికుల ఆచూకీ తెలియనుందని పేర్కొన్నారు.