Page Loader
Telangana: పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు 
పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు

Telangana: పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

విద్యుత్‌ బిల్లులను తగ్గించడమే కాదు, ఆదాయ మార్గాలను పెంచడం, పర్యావరణాన్ని సంరక్షించడం,సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం వంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేంద్ర పథకాన్ని రాష్ట్రానికి అనుసంధానించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేసింది. మహిళా సంఘాలతో భాగస్వామ్యం ఈ పథకాన్ని అమలు చేయడంలో మహిళల సహకారాన్ని కేంద్రబిందువుగా తీసుకుని, తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులతో కలిసి సౌర విద్యుత్‌ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ప్రారంభ దశలో ఏటా లక్ష మంది మహిళా సభ్యుల ఇళ్లపై సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

వివరాలు 

స్త్రీనిధి సమాఖ్య ద్వారా రుణ సాయం 

ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్‌ కీలకపాత్ర పోషిస్తోంది. సెర్ప్‌కు చెందిన స్త్రీనిధి సమాఖ్య ద్వారా మహిళలకు కేవలం 4%వడ్డీతో రుణాలు అందించాలనే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నా,వారిలో సుమారు 10లక్షల మంది ఇళ్లపై సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సెర్ప్‌ అంచనా వేసింది. కేంద్ర సర్కార్‌ నుండి రూ.78 వేల రాయితీ 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యంగల సౌర విద్యుత్‌ ప్లాంటును ఏర్పాటు చేయాలంటే రూ.80 వేల నుండి రూ.2లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద రూ.78 వేల వరకు రాయితీ (సబ్సిడీ)ని అందిస్తోంది.

వివరాలు 

అమలు విధానం 

సెర్ప్‌ ఈ కేంద్ర పథకాన్ని మహిళా సంఘాల సభ్యుల ఇళ్లపై అమలు చేయాలని నిర్ణయించగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. దీంతో కార్యాచరణ ప్రారంభమైంది. ప్రారంభ దశలో లక్ష మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వారికి రూ.78 వేల రాయితీ సొమ్ము మినహాయించిన మిగిలిన మొత్తం కోసం స్త్రీనిధి సమాఖ్య రుణాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మహిళలకు ఇచ్చే రుణాలపై 11% వడ్డీ వసూలు చేస్తున్నా, అందులో 4% వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మిగిలిన 7% వడ్డీని లబ్ధిదారులు అయిదేళ్లలో చెల్లించాలి. ఒకసారి రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత, ప్లాంట్‌ జీవితకాలం మరో 20 ఏళ్లు కొనసాగుతుంది.

వివరాలు 

ప్రత్యేకంగా ఏర్పాటవుతున్న ప్లాంట్లు 

ఈ కాలంలో లబ్ధిదారులు విద్యుత్‌ విక్రయాల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 4,000 మహిళా సంఘాల ద్వారా ఒక్కో మెగావాట్‌ సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్ల ఏర్పాటును సౌరవిద్యుత్‌ విభాగం పర్యవేక్షించనుంది.