Loading...
Sonam Wangchuk: 26 రోజుల దీక్షకు ముగింపు.. నిమ్మరసం తాగి పోరాటం విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
నిమ్మరసం తాగి పోరాటం విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

Sonam Wangchuk: 26 రోజుల దీక్షకు ముగింపు.. నిమ్మరసం తాగి పోరాటం విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

పోటీ పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టాలని,దేశ విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించిన ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ చివరకు తన దీక్షను విరమించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు,ఆందోళనకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో వారి చేతుల మీదుగా నిమ్మరసం తాగి వాంగ్‌చుక్ తన 26 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్షకు ముగింపు పలికారు.

వివరాలు 

ఆందోళనకారులపై చట్టపరమైన చర్యలుండవని ప్రభుత్వ హామీ

ఈ సందర్భంగా ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా ఆయనతో పాటు ఉన్నారు.

దీక్ష విరమణ అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన వాంగ్‌చుక్.. దేశంలో ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ఏయే షరతులను అంగీకరించిందనే విషయాలను త్వరలో విడుదల చేసే వివరణాత్మక వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తానని వెల్లడించారు.

జులై 20న నిర్వహించిన పార్లమెంట్ మార్చ్, జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించినట్లు వాంగ్‌చుక్ పేర్కొన్నారు.

వివరాలు 

11 కిలోల బరువు కోల్పోయిన వాంగ్‌చుక్

అలాగే, నీట్ పేపర్ లీకేజీ ఘటనల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని తెలిపారు.

విద్యా వ్యవస్థకు సంబంధించిన చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శిని పదవి నుంచి తొలగించిందని, కేసుల వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది.

వాంగ్‌చుక్ దీక్ష విరమణపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, వైద్యుల సూచనలు పాటిస్తూ కోల్పోయిన బరువును తిరిగి పొందాలని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.

26 రోజుల నిరాహార దీక్షలో వాంగ్‌చుక్ దాదాపు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన డిమాండ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తాం:సీజేపీ

'3 ఈడియట్స్' సినిమాలో ఫున్సుఖ్ వాంగ్డూ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ), విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేశాయి.

అయితే, నీట్ పేపర్ లీకేజీ అక్రమాలకు రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది.

ADVERTISEMENT