మహిళా రిజర్వేషన్ బిల్లు: ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు కోటా కల్పించాలని కోరిన సోనియా
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున బిల్లుపై చర్చను సోనియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ బిల్లును తన భర్త, దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తొలిసారిగా తీసుకొచ్చారని ఆమె తెలిపారు. ఇది తన జీవితంలో కూడా ఒక ఉద్వేగభరితమైన క్షణం అన్నారు. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే రాజ్యాంగ సవరణను రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని ఆమె అన్నారు. అయితే ఆ బిల్ రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు.
రాజీవ్ గాంధీ కల పాక్షికంగా పూర్తయింది: సోనియా
కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాని PV నరసింహారావు నేతృత్వంలో ఈ బిల్ రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా, స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నాయకులు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయిందని.. ఈ బిల్లు ఆమోదంతో, అది సంపూర్ణమవుతుందని లోక్‌సభలో సోనియా గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటా కల్పించాలని సోనియా గాంధీ కోరారు.