
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది, దాని అజెండాను ఇంకా వెల్లడించలేదు.
దీంతో సమావేశాల అంజెండాను చెప్పాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే అనేక సమస్యలపై చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను మోదీకి తెలియజేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
కాంగ్రెస్
'ఇండియా' పేరును రాజ్యాంగం నుంచి తొలగిస్తే ఊరుకోం: కాంగ్రెస్
అదానీ గ్రూప్‌పై తాజా ఆరోపణలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్ పరిస్థితిపై ప్రత్యేక సమావేశంలో చర్చించాలని ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. అలాగే కాంగ్రెస్ మీటింగ్‌లోనూ చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
అలాగే దేశం పేరును ఇండియాకు బదులుగా భారత్ పేరును కేంద్రం మారుస్తుందన్న ఊహాగానాలపై కూడా కాంగ్రెస్ నేతలు తమ సమావేశంలో చర్చించారు.
జీ20 విందు ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'ఇండియా'కు బదులుగా 'భారత్' అని పేరును చేర్చడంతో దేశంలో వివాదం చెలరేగింది.
'ఇండియా' పేరును రాజ్యాంగం నుంచి తొలగించే ఏ చర్యనైనా అన్ని జాతీయ పార్టీలు వ్యతిరేకిస్తాయని సమావేశంలో నిర్ణయించింది.
కాంగ్రెస్
బీజేపీ ప్రత్యేక అజెండా ఏమిటో దేశానికి చెప్పాలి: గౌరవ్ గొగోయ్
కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం అనంతరం లోక్‌సభలో పార్టీ ఉపనేత గౌరవ్ గొగోయ్ స్పందించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రత్యేక అజెండా ఏమిటో దేశానికి చెప్పాలని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ప్రత్యేక సమావేశంలో ఈ అంశం రావచ్చని కొందరు ఊహాగానాలు వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే తప్పకుండా మద్దతు ఇస్తామని సమావేశంలో పాల్గొన్న మరొక నేత చెప్పారు.