Vijayanand: త్వరలో వాట్సాప్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలో వాట్సాప్ ద్వారా 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తాజాగా వెల్లడించారు.
ఆయన శుక్రవారం సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖలు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని అందించాలని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఆర్టీజీఎస్ పనిచేస్తూ మెరుగైన ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.
ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రభుత్వ శాఖల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
Details
పౌరులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ
అలాగే తానే ఆర్టీజీఎస్ కార్యాలయాల పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.
పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టు పురోగతిపై ఆయన ఆర్టీజీఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ ఈ సందర్భంగా వాట్సాప్ గవర్నెన్స్‌కు సంబంధించిన పనులు సుమారు పూర్తయ్యాయని, డెమోను ముఖ్య కార్యదర్శికి చూపించినట్లు వివరించారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 150 రకాల సేవలు ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
Details
తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సేవలు
ప్రజలు తమ ఫిర్యాదులు కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా చేసుకునే అవకాశాన్ని కల్పించాలని భావించారు.
ఈ సేవలు ఇంగ్లీషు, తెలుగు భాషలలో అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం సూచించారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖలతో ఆర్టీజీఎస్ సమన్వయం చేయాలని, శాఖల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సహకారం అందించే విధంగా ఆర్టీజీఎస్‌కు సూచనలిచ్చారు.
ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.