Page Loader
Amaravati: అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!
అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!

Amaravati: అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన ఐకానిక్‌ టవర్ల పనులపై ప్రభుత్వం మళ్లీ దృష్టిసారించింది. ఐదు టవర్ల నిర్మాణాన్ని ఐదేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభించేందుకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వీటి పునాదుల్లో నిలిచిన 0.06 టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తొలగించారు. ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పూర్తిగా బయటపడడంతో, మళ్లీ ఐఐటీ మద్రాసు సివిల్ ఇంజినీరింగ్ నిపుణులతో పరీక్షలు నిర్వహించేందుకు సీఆర్డీఏ లేఖ రాసింది. గత ఆగస్టులోనూ ఈ పరీక్షలు నిర్వహించగా, నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని నిపుణులు నిర్ధారించారు. తుప్పు పట్టిన ఇనుప రాడ్లకు రసాయన తాపడం చేయించి పనులు కొనసాగించవచ్చని సూచించారు.

Details

 టెండర్ల ప్రక్రియ షురూ 

తాజా పరిశీలనలో భాగంగా భౌతికంగా టవర్ల స్థితిని పరిశీలించి, కాంక్రీట్ నిర్మాణాలకు కోర్‌కటింగ్‌ టెస్టులు, ఇనుప రాడ్ల నమూనాల పరీక్షలు చేపట్టనున్నారు. తుది ఫలితాల ఆధారంగా పనులను పునఃప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అవసరమైతే ఎత్తును తగ్గించేందుకు కొత్త నమూనాలు రూపొందించనున్నారు. అమరావతి ఐకానిక్ టవర్లలో మొత్తం ఐదు బహుళ అంతస్తులు నిర్మించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ టవర్ల నిర్మాణానికి రూ.2,703 కోట్లతో మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు.

Details

పది రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం

ముఖ్యంగా జేఏడీ టవర్‌ను 47 అంతస్తులతో, మిగిలిన నాలుగు హెచ్‌వోడీ టవర్లను 39 అంతస్తులతో ఫోస్టర్స్‌ సంస్థ డిజైన్ చేసింది. అయితే తాజా అంచనాల ప్రకారం వ్యయం రూ.4,687 కోట్లకు పెరిగింది. ఐదో టవర్‌కు 70 శాతం, 3, 4 టవర్లకు 78 శాతం, 1, 2 టవర్లకు 71.54 శాతం మేర ఖర్చు పెరిగింది. పెరిగిన వ్యయంతోపాటు కొత్త అంచనాలను పరిగణనలోకి తీసుకుని పదిరోజుల్లోనే టెండర్లను పిలిచే అవకాశం ఉంది.