తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
జూన్ 20 గడుస్తున్నా వేసవి వేడితో అల్లాడుతున్న జనాలకు ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్దే నిలిచిపోయిన రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది. గతంలోనే ఏపీలో నైరుతి ప్రవేశించిందని, ఈ మేరకు సోమవారం పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తెలంగాణలోకి మాత్రం ఈ నెల 22 నాటికి నైరుతి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. మరోవైపు మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వివరించింది.
మునగాల మండలంలో అత్యధికంగా 44.2 డిగ్రీలతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత
మరోవైపు ఎండల తీవ్రత రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సైతం కొనసాగడం గమనార్హం. కొన్ని ప్రదేశాల్లో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం కలవరపెట్టే అంశంగా మారింది. ఖమ్మం, రామగుండం, మెదక్, భద్రాచలం ప్రాంతాల్లో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దాదాపు 13 జిల్లాల్లోని 36 మండలాల్లో వడగాలులు వీస్తుండగా, దాదాపు 10 మండలాల్లో వేడి తీవ్రత అమాంతం పెరిగిపోయింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 2 చొప్పున, రాజన్నసిరిసిల్ల,పెద్దపల్లి, సూర్యాపేట, భూపాలపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో అత్యధికంగా 44.2 డిగ్రీలతో, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యింది.