
CM Chandrababu: రాజధాని పనులు వేగవంతం చేయండి.. గడువు కంటే ముందే పూర్తి చేయాలన్న సీఎం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్ణయించిన గడువు కంటే ఆరు నెలల ముందుగానే పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన రాజధాని నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఎల్‌పీఎస్ లేఔట్లలో అభివృద్ధి పనులు, మంత్రులు-ఎమ్మెల్యేలు-అధికారులు-ఉద్యోగులు-న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, వరద నియంత్రణ పనులు వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు, 74 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు నివేదించారు.
Details
కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా బాధ్యత వహించాలి
పనుల వేగం పెంచాలని సూచించిన సీఎం, ప్రతి నెలా అమరావతి పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. సమయానికి పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పనులపై రియల్‌టైమ్ పర్యవేక్షణ చేపడతానని చెప్పారు. అమరావతిలో కార్యాలయాల నిర్మాణాలకు అనుమతులు వేగంగా ఇవ్వాలని ఆదేశిస్తూ, బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి సంస్థలకు త్వరగా భూములు కేటాయించాలని సూచించారు. ఇప్పటికే భూములు కేటాయించిన 72 సంస్థలు ఎంత మేరకు నిర్మాణాలు చేపట్టాయో నిరంతర పర్యవేక్షణ అవసరమని అన్నారు. వీటికి అనుసంధానంగా పెట్టుబడులు, వెంచర్లు రాబట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Details
అమరావతిని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా
"కేవలం భవనాల నిర్మాణంతోనే రాజధాని నగరం పూర్తి కాదు. పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు, నాలెడ్జ్ ఎకానమీ, స్టార్టప్ ఎకోసిస్టమ్ రావాలి. టాప్-10 రియల్ ఎస్టేట్ కంపెనీలను ఆహ్వానించి ప్రాజెక్టులు చేపట్టేలా చూడాలి. అమరావతిని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా మార్చి, ఈవీ వాహనాలను ప్రోత్సహించాలి. సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఏరియాలో గాలి నాణ్యతను కొలిచి, డేటాను ప్రదర్శించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Details
రైతుల సమస్యలకు పరిష్కారం - మాస్టర్ ప్లాన్ కాపాడాలి
రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు. రైతుల విజ్ఞప్తులను పరిశీలించి, మాస్టర్ ప్లాన్‌కు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశాన్ని వారం రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోవడంతో నిర్మాణ సామగ్రి, ఇనుము తుప్పు పట్టిందని కాంట్రాక్టర్లు తెలిపారు. అలాగే, నిర్మాణం కోసం సేకరించిన ఇసుకను కూడా గత పాలకులు తరలించారని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన సీఎం, ఆ ఇసుకను అందించాలని మైనింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.