Page Loader
SpiceJet: గోవా-పూణె విమానంలో షాకింగ్ ఘటన.. గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికుల ఆందోళన
గోవా-పూణె విమానంలో షాకింగ్ ఘటన.. గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికుల ఆందోళన

SpiceJet: గోవా-పూణె విమానంలో షాకింగ్ ఘటన.. గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికుల ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, విమానయానంపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఆ భయం మరింత ఎక్కువైంది. ప్రయాణంలో ఎప్పుడేం జరుగుతుందో అనే అనుమానంతో విమాన ప్రయాణం అంటేనే భయంకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే తాజాగా చోటుచేసుకున్న ఘటన మాత్రం విమానయాన సంస్థల్లో నిర్లక్ష్యం ఇప్పటికీ దాగివుండిందని స్పష్టం చేస్తోంది. గోవా నుండి పూణె వైపు వెళ్తున్న స్పైస్‌ జెట్‌కు చెందిన ఒక విమానంలో, గాలిలో ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా కిటికీకి సంబంధించిన ఫ్రేమ్ ఊడిపోవడం కలకలం రేపింది.

వివరాలు 

వీడియోని ఇంటర్నెట్‌లో షేర్ చేసిన ప్రయాణికుడు

ఈ సంఘటన ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని నెలకొల్పింది. ఆ సమయంలో ఉన్న కొంతమంది ప్రయాణికులు కంగారుపడగా, ఒకరు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది.స్పైస్‌జెట్‌కు చెందిన SG1080 విమానం గోవా నుంచి పూణెకి వెళ్తుండగా గాల్లో ఉండగానే ఈ సంఘటన జరిగింది. తక్షణమే ఆ దృశ్యాన్ని చిత్రీకరించిన ఒక ప్రయాణికుడు వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన స్పైస్‌జెట్ సంస్థ, ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. పూణె ఎయిర్‌పోర్ట్‌లో కిటికీ ఫ్రేమ్‌ను తగిన విధంగా మరమ్మతులు చేశామని పేర్కొంది.

వివరాలు 

ఇటువంటి విమానాలకు ఎగిరే అర్హత ఉందా?

క్యాబిన్‌లో ప్రెజర్ వ్యవస్థ సక్రమంగానే ఉందని, ఆ ఫ్రేమ్ ఊడిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా స్పష్టం చేసింది. తమ సంస్థ ప్రయాణికుల భద్రతపై ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేసింది. అయితే, ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విమానాలు ఎగరే ముందు సమగ్ర తనిఖీలు చేయకుండా ఎలా నడుపుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎయిర్‌లైన్స్‌ను పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి విమానాలకు ఎగిరే అర్హత ఉందా? అని కొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్