
AP Liquor Scam: మద్యం కుంభకోణంలో ఎస్‌పీవై యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ హాయంలో చోటు చేసుకున్న వేలకోట్ల మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని (ఏ6) సిట్ అధికారులు అరెస్టు చేశారు.
అనంతరం ఆయనను విజయవాడకు తరలించి, శనివారం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన సమావేశాలు వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 తర్వాత ప్రారంభమయ్యాయి.
నూతన మద్యం విధానాన్ని ముసుగుగా నెలకు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ముడుపులు వసూలు చేయడానికి సాగిన చర్చలలో శ్రీధర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు.
ఈ సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, అప్పటి పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఐటీ సలహాదారు రాజ్ కెసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.
Details
సిండికేట్‌లో ప్రధాన పాత్రధారిగా శ్రీధర్ రెడ్డి
శ్రీధర్‌రెడ్డి సిండికేట్‌లో ప్రధాన పాత్రధారిగా వ్యవహరించారు.
ఆయనకు చెందిన ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీ నంద్యాలలో ఉన్న డిస్టిలరీలో ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి 'జే బ్రాండ్లు' ఉత్పత్తి చేశారు. ఈ బ్రాండ్లకే అధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించాయి.
మద్యం సరఫరా ఆర్డర్లను అడ్డుపెట్టుకుని ముడుపులు వసూలు చేయాలనే యోచనను ముందుకు తెచ్చింది కూడా శ్రీధర్‌రెడ్డే. కస్టడీలోకి తీసుకున్న తరువాత మిగిలిన కుట్రదారులు, నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంపై లోతుగా విచారణ జరగనుంది.
ముడుపుల ప్రణాళిక సిద్ధం చేసిన అనంతరం శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ముడుపులు చెల్లించే వారికే సరఫరా ఆర్డర్లు ఇస్తామని స్పష్టం చేయడంతో పాటు, అంగీకరించకపోతే తీవ్ర నష్టాలు కలుగుతాయని బెదిరించారు.
Details
శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర
ఈ బెదిరింపుల వల్ల పలువురు డిస్టిలరీ యజమానులు మొదటగా మూలధరపై 12% ముడుపులు చెల్లించేందుకు అంగీకరించగా, త్వరలోనే అది 20%కి పెరిగింది.
శ్రీధర్‌రెడ్డికి చెందిన ఎస్‌పీవై ఆగ్రో, సన్‌హోక్ ల్యాబ్స్, డీకార్ట్ లాజిస్టిక్స్ మధ్య రూ.60 కోట్ల మేర డబ్బు రూటింగ్ జరిగింది.
ఇందులో డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి రూ.5 కోట్లు జమ అయినట్లు గుర్తించారు.
ఈ లావాదేవీలలోనూ శ్రీధర్‌రెడ్డి కీలక పాత్రలో ఉన్నారు.
మొదటి దశలో రాజ్ కెసిరెడ్డి, ముప్పిడి అవినాష్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి మద్యం సరఫరా కంపెనీలతో ముడుపుల విషయాల్లో చర్చించేవారు.
Details
చీప్ లిక్కర్ బ్రాండ్లపై ముడుపులు
రెండో దశలో విజయవాడలోని కంపెనీల బాధ్యత వాసుదేవరెడ్డి చూసేవారు.
హైదరాబాద్ పరిధిలోని బాధ్యతలను మొదట అవినాష్‌రెడ్డి, తరువాత చాణక్య అలియాస్ ప్రకాశ్ నిర్వహించారు. వారు చర్చల్లో మద్యం మూలధరను పరిగణనలోకి తీసుకునే విధానాన్ని అవలంబించేవారు.
చీప్ లిక్కర్ బ్రాండ్లపై వసూలు చేయబడిన ముడుపులు ఈ విధంగా ఉన్నాయి
సదరన్ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్ర గోల్డ్, హెచ్‌డీ విస్కీ వంటి వాటికి కేసుకు రూ.150, దారూహౌస్, రాయల్ ప్యాలెస్, బ్రిలియంట్ బ్లెండ్‌లకు రూ.200, మ్యాన్షన్ హౌస్, రాయల్ స్టాగ్‌కు రూ.350, టీచర్స్, 100 పైపర్స్ వంటి ప్రీమియం బ్రాండ్లకు కేసుకు రూ.600 వరకు ముడుపులు వసూలు చేశారు.
ఈ వ్యవహారాలన్నింటిలోనూ శ్రీధర్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్టు అధికారులు నిర్ధారించారు.