ప్రధానిపై సీఎం స్టాలిన్ ఫైర్.. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అంటూ నిలదీత
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మం'పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపాయి.ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఉదయనిధి 'సనాతన ధర్మం' గురించి ఏం మాట్లాడారో తెలియకుండానే ప్రధాని మోదీ స్పందించడం అన్యాయమన్నారు. ఉదయనిధిపై వస్తున్న విమర్శలను తప్పుడు కథనాలుగా ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.అణిచివేత గురించి మాట్లాడిన ఉదయనిధి మాటలను నిరంకుశ పోకడలున్న బీజేపీ అనుకూల శక్తులు సహించలేకపోతున్నాయన్నారు. అసలు ఉదయనిధి ఎటువంటి మారణహోమానికి పిలుపునివ్వలేదని, తప్పుడు వార్తలను వ్యాప్తిచేస్తున్నారంటూ మండిపడ్డారు.ఈ మేరకు ఉదయనిధిపై బీజేపీ సోషల్ మీడియా ఉత్తరాదిలో అబద్దాపు ప్రచారాన్ని విస్తృతం చేసిందన్నారు. తమిళంలో గానీ ఆంగ్లంలో గానీ ఉదయనిధి జాతి హత్య అనే పదాన్నే ఉపయోగించలేదని కుండబద్దలు కొట్టారు.
సనాతన వివక్ష పట్ల బీజేపీకి పట్టింపు లేదు: స్టాలిన్
అయినా బీజేపీ అబద్ధాలనే ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ సాధువు తన కొడుకు తలపై బహుమతి ప్రకటించడాన్ని స్టాలిన్ ఖండించారు. ఈ మేరకు సాధువుపై చర్యలు తీసుకున్నారా లేదా అని యోగీ సర్కారును ప్రశ్నించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై సరిగ్గా స్పందించాలని ప్రధాని పేర్కొడం తమను నిరుత్సాహపరిచిందని స్టాలిన్ అన్నారు.నివేదికను పూర్తిగా తెలుసుకుని, ధృవీకరించుకునేందుకు ప్రధానికి ఉన్న వెసులుబాట్లను వాడుకోవాలన్నారు. అంతేగానీ ఉదయనిధి గురించి ఇలాంటి తప్పుడు ప్రచారంపై ప్రధానికి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్, కేవలం రాజకీయ జిమ్మిక్కేనని ఎద్దేవా చేశారు. సనాతన వివక్ష పట్ల కేంద్రంలోని అధికార బీజేపీకి ఏమాత్రం పట్టింపే లేదన్నారు.