Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో సుపరిపాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం దిల్లీలో ఒక మీడియా ఛానల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై తమ విజన్ స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ నది పునరుద్ధరణ, రేడియల్ రోడ్స్ వంటి ప్రధాన లక్ష్యాల కోసం ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇప్పుడు తమ నినాదం 'రైజింగ్ తెలంగాణ' అని ప్రకటిస్తూ, ప్రపంచీకరణలో చైనా ప్లస్ వన్ కంట్రీకి చైనా ప్లస్ తెలంగాణ మార్గం చూపిస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం, సుపరిపాలన అందించడం తమ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.
ప్రధానిపై రేవంత్ రెడ్డి విమర్శలు
సంక్షేమ కార్యక్రమాలు నిజమైన అర్హులైన పేదల వరకు చేరాలంటే సరైన గణాంకాలు అవసరమని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఓబీసీ గణాంకాలు సేకరించాల్సిన అవసరం ఉందని, ఆ ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచనతో కేంద్రమే ముందుకు రావాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా, ముందుగా ప్రాతిపదిక స్పష్టత ఇవ్వాలని, లేకుంటే ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలను గుజరాత్‌కు మళ్లిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ప్రధాని దేశానికి ఒక జడ్జిలా ఉండాలని, రిఫరీగా ఒక జట్టు తరఫున ఆడకూడదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు దేశ ప్రయోజనాలకు అనుకూలం కావని ఆయన వివరించారు.