
ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన సమస్యలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని, తాము కేవలం మధ్యవర్తిగా ఉంటామని స్పష్టం చేసింది.
విభజన చట్టంలోని వివిధ అంశాలపై తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని లోక్‌సభలో వివిధ ప్రశ్నలు అడిగారు.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు.
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్వహణ సాంకేతికంగా, ఆర్థికంగా ఇబ్బందికరమని కేంద్రం ప్రకటించింది.
అందుకే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఉక్కుశాఖ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని కేంద్రం గుర్తుచేసింది.
వివిధ వర్సిటీలు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణాలకు కలిపి రూ. 21,154 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది.
DETAILS
మేజర్‌పోర్టుకు రామాయపట్నం వద్దంటే మరో ప్రదేశాన్ని గుర్తించాలని కేంద్రం సూచన
గిరిజన వర్సిటీకి రూ.24 కోట్లు, వ్యవసాయ వర్సిటీకి రూ.135 కోట్లు, ఐఐటీకి రూ.1,022కోట్లు, పోలవరానికి రూ.14,969 కోట్లు, ఎయిమ్స్‌కు రూ.1,319 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, ఐసర్‌కు రూ.1,184 కోట్లు విడుదల చేసినట్లు నివేదికలో పేర్కొంది.
రూ.106 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పి, 2023-24లో రూ.10 కోట్లే కేటాయించారని ఎంపీలు సభ దృష్టికి తీసుకెళ్లారు.
దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదని కేంద్రం బదులిచ్చింది. ఇప్పటికే రామాయపట్నం నాన్ మేజర్ పోర్టుగా నోటిఫై చేశారని, రామాయపట్నం మైనర్ పోర్టును డి-నోటిఫై చేయాల్సిందిగా గతంలోనే ఏపీకి చెప్పినట్లు కేంద్రం వివరించింది.
మేజర్‌పోర్టుకు రామాయపట్నం వద్దంటే మరో ప్రదేశాన్ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచనలు చేసింది.